అల‌ర్ట్‌.. ఏపీలో రానున్న మూడు రోజులు భారీ వ‌ర్షాలు

Rains for next three days in AP.ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో రానున్న మూడు రోజుల్లో భారీ వ‌ర్షాలు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 Dec 2022 7:52 AM GMT
అల‌ర్ట్‌.. ఏపీలో రానున్న మూడు రోజులు భారీ వ‌ర్షాలు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో రానున్న మూడు రోజుల్లో భారీ వ‌ర్షాలు కురుస్తాయని ఐఎండీ(భార‌త వాతావ‌ర‌ణ విభాగం) తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతం, ద‌క్షిణ అండ‌మాన్‌లో ఏర్ప‌డిన అల్ప‌పీడ‌నం మంగ‌ళ‌వారం సాయంత్రం నాటికి బ‌ల‌ప‌డే సూచ‌న‌లు ఉన్నాయ‌ని వాతావ‌ర‌ణ కేంద్రం చెప్పింది. వాయువ్య దిశ‌గా క‌దులుతూ ఎల్లుండి తుఫాన్‌గా మారే అవ‌కాశం ఉంద‌ని పేర్కొంది. ఈ నెల 8న ఉద‌యానికి ఉత్త‌ర త‌మిళ‌నాడు, పుదుచ్చేరి-ద‌క్షిణ కోసాంధ్ర స‌మీపంలో తీరానికి చేరుతుంద‌ని ఐఎండీ తెలిపింది.

ఈ తుఫాన్ ప్ర‌భావం ద‌క్షిణ కోస్తాంధ్ర‌, రాయ‌ల‌సీమ‌ల్లో ఎక్కువ‌గాను, ఉత్త‌ర కోస్తాలో స్వ‌ల్పంగాను ఉంటుంది. బుధవారం దక్షిణ కోస్తాలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, నెల్లూరు జిల్లాలో అక్కడక్కడా భారీవర్షాలు కురవ‌నున్నాయ‌ని చెప్పింది.

గురువారం దక్షిణ కోస్తాలో పలుచోట్ల, ఉత్తర కోస్తాలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిస్తాయ‌ని పేర్కొంది.

శుక్రవారం దక్షిణ కోస్తాలో అనేకచోట్ల, ఉత్తర కోస్తాలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో ఒకట్రెండు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే సూచ‌న‌లు ఉన్నాయ‌ని ఐఎండీ హెచ్చ‌రించింది. మ‌త్స్య‌కారులు ఎవ‌రూ కూడా చేప‌ల వేట‌కు వెళ్లొద్ద‌ని సూచించింది.


Next Story