Telangana: రైతులకు అలర్ట్‌.. 3 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు

రాగల 3 రోజుల్లో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.

By అంజి  Published on  5 May 2024 7:45 PM IST
Rainfall, thunderstorms, Telangana, IMD, rain

Telangana: రైతులకు అలర్ట్‌.. 3 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు 

హైదరాబాద్: గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు తీవ్రంగా పెరిగాయి. ప్రజలు ఉక్కపోత, వడగాలులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే తాజాగా భారత వాతావరణ విభాగం - హైదరాబాద్‌.. రాష్ట్ర ప్రజలకు ఎండ నుంచి ఉపశమనం కల్పించే వార్త చెప్పింది. రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురవనున్నాయి. ఈ నేపథ్యంలోనే ఐఎండీ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. మే 6 నుండి, తెలంగాణాలో శక్తివంతమైన ఉరుములు, మెరుపులతో వర్షాలు.. చాలా జిల్లాల్లో మే 9 వరకు కురవవచ్చని అంచనా వేయబడింది.

సోమవారం భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, మహబూబాబాద్, హనుమకొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మంగళవారం సిద్దిపేట, రంగారెడ్డి, భువనగిరి, వికారాబాద్, మహబూబ్ నగర్ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

కొత్తగూడెం, ఖమ్మం, సిద్దిపేట, భువనగిరి, హైదరాబాద్ , రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు. బుధ, గురువారాల్లోనూ పలు చోట్ల భారీ, మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించారు.

అయితే సోమవారం కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేయబడింది. ఇది తెలంగాణలోని కొన్ని జిల్లాలలో వేడిగాలులను సూచిస్తుంది. ఐఎండీ హైదరాబాద్ సూచన ప్రకారం.. తెలంగాణలోని ఆదిలాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో సోమవారం కూడా వేడిగాలులు వీయనున్నాయి. తెలంగాణలో ఉష్ణోగ్రత 47.1 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంది. ఇదిలా ఉండగా, రాష్ట్రంలోని సుమారు 15 జిల్లాల్లోని 70కి పైగా ప్రాంతాల్లో ఆదివారం ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్‌ను అధిగమించాయి.

తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (TSDPS) ప్రకారం, జగిత్యాలలోని వెల్గటూర్‌లో 47.1 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా, జగిత్యాలలోని గొడూరు, అల్లీపూర్‌లు వరుసగా 46.8 డిగ్రీల సెల్సియస్, 46.7 డిగ్రీల సెల్సియస్‌తో దగ్గరగా ఉన్నాయి.

అలాగే ఖమ్మం, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లోని పలుచోట్ల వర్షాలు కురిశాయి. హైదరాబాద్‌లో ఆదివారం డిగ్రీ సెల్సియస్ 42.8 డిగ్రీల సెల్సియస్, గోల్కొండ, కూకట్‌పల్లిలో 44 డిగ్రీల సెల్సియస్‌లు నమోదయ్యాయి. సరూర్‌నగర్‌లో 43.8 డిగ్రీల సెల్సియస్‌, ఆసిఫ్‌నగర్‌లో 43.6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఉరుములతో కూడిన వర్షం కారణంగా రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో 41 డిగ్రీల సెల్సియస్ నుండి 44 డిగ్రీల సెల్సియస్, హైదరాబాద్‌లో 36 డిగ్రీల సెల్సియస్ నుండి 40 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.

Next Story