ఏపీ, తెలంగాణలో నాలుగు రోజుల పాటు వర్షాలు
ఏపీ, తెలంగాణలో గత నాలుగు రోజులుగా అక్కడక్కడ వర్షాలు కురిశాయి
By Srikanth Gundamalla Published on 26 Nov 2023 9:17 AM IST
ఏపీ, తెలంగాణలో నాలుగు రోజుల పాటు వర్షాలు
ఏపీ, తెలంగాణలో గత నాలుగు రోజులుగా అక్కడక్కడ వర్షాలు కురిశాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉంటోంది. హైదరాబాద్‌లో అయితే.. గత రెండ్రోజుల్లో వర్షాలు బాగానే పడ్డాయి. ఇక నల్లగొండతో పాటు పలు ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయి. ఏపీలోనూ ఇదే విధంగా పలుప్రాంతాల్లో వర్షాలు పడ్డాయి. ఈ క్రమంలో వాతావరణశాఖ మరోసారి రెయిన్ అలర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతం, దక్షిణ అండమాన్ దగ్గర నవంబర్ 27న అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇది నవంబర్ 29వ తేదీ నాటికి వాయుగుండంగా బలపడుతుందని చెప్పారు. దాంతో.. కోస్తా, రాయలసీమ జిల్లాల్లో నాలుగైదు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అల్లూరి సీతారామరాజు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రదేశాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఈశాన్య, ఆగ్నేయ దిశ నుంచి తెలంగాణ వైపు గాలులు వీస్తున్నాయని.. వచ్చే నాలుగు రోజుల పాటు తెలంగాణలో కూడా ఓ మోస్తారు నుంచి తేలిక పాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. ముఖ్యంగా నల్గొండ, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, జనగాం, జగిత్యాల పరిసర ప్రాంతాల్లో వర్షాలు కురవొచ్చునని తెలిపారు. ఈ వర్ష ప్రభావం వల్ల ఉదయం పూట ఉష్ణోగ్రతలు తగ్గనున్నట్లు అధికారులు వెల్లడించారు.
అయితే.. వాతావరణశాఖ అలర్ట్‌తో వరి రైతులు ఆందోళన చెందుతున్నారు. కొన్ని చోట్ల వరి కోతకు సిద్ధంగా ఉందని.. వర్షాలు పడితే ఇబ్బందులు తప్పవని అంటున్నారు. కొందరు వరి పైరు కోసి.. ధాన్యం ఆరబోశామని చెబుతున్నారు. కొన్ని చోట్ల ధాన్యం కుప్పలు ఉన్నాయని ఇప్పుడు వర్షాలు పడితే ఇబ్బందులు ఎదురువుతున్నాయని ఆందోళన చెందతున్నారు. తెలంగాణ, ఏపీలోని పలుప్రాంతాల్లో పత్తి పొల్లాల్లో కూడా తీయాల్సిన పత్తి ఇంకా ఉంది. దాంతో.. పత్తి వర్షానికి తడిస్తే రేటు పడదని అంటున్నారు. అయితే.. వర్షాలు స్వల్పంగానే ఉంటాయని చెప్పడంతో కొంతమేర ఊపిరిపీల్చుకుంటున్నారు రైతులు. వరి ధాన్యం కుప్పలు పెట్టినవారు మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణశాఖ అధికారులు సూచిస్తున్నారు.