తెలుగు రాష్ట్రాలకు భారీ నుంచి అతిభారీ వర్ష సూచన
తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
By Srikanth Gundamalla Published on 18 July 2024 2:45 AM GMTతెలుగు రాష్ట్రాలకు భారీ నుంచి అతిభారీ వర్ష సూచన
తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణలో ఇవాళ్టి నుంచి నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. మధ్యప్రదేశ్ పరిసరాల్లో ఉన్న అల్పపీడనం బుధవారం బలహీనపడింది. మరోవైపు రేపు పశ్చిమ మధ్య, దానికి ఆనుకుని వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. వీటన్నింటి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయన్నారు.
ఇవాళ జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, కుమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఉరుములు మెరుపులతో పాటు భారీ ఈదురు గాలులు కూడా వీచే అవకాశం ఉందని చెప్పారు. గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో గాలులకు అవకాశం ఉందని చెప్పారు. పలు చోట్ల పిడుగులు పడే చాన్స్ ఉందనీ.. రైతలు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
మరోవైపు కోస్తాంధ్రలో రాబోయే మూడ్రోజులు భారీ వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఈ నెల 19న మరో అల్పపీడనం ఏర్పడుతుందని చెప్పారు. రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడతాయని చెబుతున్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయన్నారు. వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు, మిగిలిన చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది.