ఆగ్నేయ బంగాళాఖాతం, దక్షిణ అండమాన్ సముద్రం మీద అల్పపీడన ద్రోణి కొనసాగుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ పేర్కొంది. దీంతో రాగల 24 గంటలలో ఆగ్నేయ బంగాళాఖాతం, పరిసర ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలియజేసింది. అల్పపీడనం పశ్చిమ-వాయువ్యదిశగా కదులుతూ గురువారం తెల్లవారుజామున వాయుగుండంగా ఉత్తర తమిళనాడు తీరానికి చేరుకునే అవకాశం ఉందని వెల్లడించింది. దీని ప్రభావంతో బుధ, గురువారాల్లో దక్షిణకోస్తాలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. రాబోయే 4 రోజుల పాటు దక్షిణకోస్తా-తమిళనాడు తీరాల వెంబడి గంటకు 40-60 కీ.మీ వేగంతో గాలులు వీయనున్నట్లు వెల్లడించింది. సముద్రం అలజడిగా ఉంటుందని.. మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని హెచ్చరించింది. భారీ వర్షాల నేపధ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల శాఖ కమిషనర్ కె. కన్నబాబు సూచించారు.