దేశ రాజధానిలో తీవ్రమైన వాయు కాలుష్యం.. ప్రభుత్వ కార్యాలయాల పని వేళలు మార్పు
దేశ రాజధాని దిల్లీలో వాయు కాలుష్యం తో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
By Kalasani Durgapraveen Published on 16 Nov 2024 7:36 AM IST
దేశ రాజధాని దిల్లీలో వాయు కాలుష్యం తో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వాయు నాణ్యత సూచీ (ఏకీప్యాఐ) అతి తీవ్రస్థాయికి నగరంలో పడిపోయింది. ఉదయం 9 గంటల సమయంలో అది ఏకంగా 411గా నమోదైంది. మొత్తం 39. పర్యవేక్షణ కేంద్రాలు ఉండగా 27 స్టేషన్లలో ఏక్యూఐ 400కిపైగా నమోదవడం గమనార్హం. నానాటికి వాయు కాలుష్యం పెరుగుతుండటంతో విద్యార్థులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలంటూ దిల్లీ పాఠశాలలు సూచించాయి. ఐదో తరగతి వరకు ఉన్న పాఠశాలలు సోమవారం నుంచి ఆన్లైన్లోనే పాఠాలు భోదించనున్నాయి.
కాలుష్య తీవ్రత నేపథ్యంలో నగరంలో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (జీఆర్ఎపీ)-3 ఆంక్షలను అమల్లోకి తీసుకొస్తున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. దీని ప్రకారం దిల్లీలో అత్యవసరం కాని నిర్మాణాలు చేపట్టకూడదు. కూల్చివేతలపై నిషేధం ఉంది. నగరంలో బీఎస్-3 పెట్రోల్, బీఎస్-4 డీజిల్ వాహనాల ప్రయాణాలను నిషేధిస్తున్నట్లు సర్కారు ప్రకటించారు. ఇతర రాష్ట్రాల నుంచి దిల్లీలోకి ఎలక్ట్రిక్, సీఎన్బీ వాహనాలు మినహా ఇతర వాహనాల ప్రవేశాన్ని అనుమతించబోమని స్పష్టం చేశారు. మెట్రో సేవలను మరో 60 ట్రిప్పులను పెంచుతున్నామని దిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు.
దిల్లీలో ట్రాఫిక్ రద్దీని పరిష్కరించడానికి ప్రభుత్వ కార్యాలయాల పని వేళలను మారుస్తూ ముఖ్యమంత్రి ఆతిశీ నిర్ణయం తీసుకున్నారు. దిల్లీ మున్సిపాలిటీ (ఎంసీడీ) పరిధిలోని కార్యాలయాలు ఉదయం 8.30 నుంచి 5 గంటల వరకు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు ఉదయం. 9 నుంచి సాయంత్రం 5.30 వరకు. ఢిల్లీ ప్రభుత్వ ఆఫీసులు ఉదయం 10 నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు పనిచేయాలని ఆదేశించారు.