తెలంగాణ‌లో ప‌డిపోతున్న ఉష్ణోగ్ర‌త‌లు.. రానున్న మూడు రోజులు ఇంతే

Minimum temperatures will drop next three days below normal in many TS districts.తెలంగాణ రాష్ట్రంలో చ‌లి తీవ్ర‌త

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 Feb 2022 5:37 AM GMT
తెలంగాణ‌లో ప‌డిపోతున్న ఉష్ణోగ్ర‌త‌లు.. రానున్న మూడు రోజులు ఇంతే

తెలంగాణ రాష్ట్రంలో చ‌లి తీవ్ర‌త పెరిగింది. గ‌త రెండు, మూడు రోజులుగా సాధార‌ణ ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు అవుతున్నా.. రానున్న మూడు రోజుల్లో ఉష్ణోగ్ర‌త‌లు త‌గ్గే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ వెల్ల‌డించింది. మారిన వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల కార‌ణంగా మూడు రోజుల పాటు గ‌రిష్ట‌, క‌నిష్ట ఉష్ణోగ్ర‌త‌ల్లో త‌గ్గుద‌ల న‌మోదు కానున్న‌ట్లు చెప్పింది. రాష్ట్రంపై ఉత్తర–దక్షిణ ద్రోణి కొనసాగుతోంద‌ని.. ఇది నైరుతి బిహార్‌ నుంచి ఛత్తీస్‌గఢ్, విదర్భల మీదుగా ఉత్తర తెలంగాణ వరకు సగటు సముద్ర మట్టం నుంచి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నట్లు వాతావరణశాఖ పేర్కొంది.

నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం నారాయణపేట్, మహబూబ్‌నగర్, వనపర్తి, జోగుళాంబ గద్వాల, నాగర్‌కర్నూల్ జిల్లాలో శని, ఆది, సోమవారాల్లో సాధార‌ణ ఉష్ణోగ్ర‌త‌లు నమోదుఅవుతాయ‌ని.. మిగ‌తా జిల్లాల్లో క‌నిష్ఠ ఉష్ణోగ్ర‌త‌లు 11 నుంచి 15 డిగ్రీల సెల్సియ‌స్ మ‌ధ్య న‌మోదు అయ్యే అవ‌కాశం ఉన్న‌ట్లు వెల్ల‌డించింది. సాధార‌ణ ఉష్ణోగ్ర‌త‌ల‌తో పోలిస్తే.. 2 నుంచి 4 డిగ్రీల మేర ఉష్ణోగ్ర‌త‌లు త‌గ్గే అవ‌కాశం ఉన్న‌ట్లు చెప్పింది.

ఇక శుక్ర‌వారం రాష్ట్ర వ్యాప్తంగా న‌మోదు అయిన ఉష్ణోగ్ర‌త‌ల‌ను ఓ సారి ప‌రిశీలిస్తే.. గరిష్ట ఉష్ణోగ్రత నిజామాబాద్‌లో 33.9 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత వికారాబాద్‌ జిల్లా మర్పల్లిలో 11.3 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలో అర్లిటిలో 6 డిగ్రీలు, బేలాలో 6.9 డిగ్రీలు న‌మోదు అయ్యాయి.

Next Story