నైరుతి బంగాళాఖాతం, ఆనుకుని ఉన్న శ్రీలంక తీరంలో 'దిత్వా' తుపాన్ కొనసాగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో ఇవాళ్టి నుంచి రాష్ట్రంలో వర్షాలు పడతాయని వివరించింది. నేడు గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు ఛాన్స్ ఉందని వెల్లడించింది. ఆదివారం తెల్లవారుజామున నైరుతి బంగాళాఖాతం తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణకోస్తా తీరాలకు చేరుకునే అవకాశం ఉందంది. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని హెచ్చరించింది.
రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. శని, ఆది, సోమవారాల్లో కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది. ఇదిలా ఉంటే.. తెలంగాణలో రేపు, ఎల్లుండి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఎల్లుండి రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది.