అల్పపీడనం, వాయుగుండం.. ఏపీలో అతి భారీ వర్షాలు

దక్షిణ అండమాన్‌ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. అలాగే నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన మరో అల్పపీడనం ఇవాళ తీవ్ర అల్ప పీడనంగా...

By -  అంజి
Published on : 26 Nov 2025 7:05 AM IST

India Meteorological Department, extremely heavy rains, APnews, cyclone

అల్పపీడనం, వాయుగుండం.. ఏపీలో అతి భారీ వర్షాలు

అమరావతి: దక్షిణ అండమాన్‌ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. అలాగే నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన మరో అల్పపీడనం ఇవాళ తీవ్ర అల్ప పీడనంగా, 24 గంటల్లో వాయుగుండంగా మారనుంది. ఇది మూడు రోజుల్లో దక్షిణ కోస్తాంధ్రలో తీరం దాటుతుంది. దీని ప్రభావంతో ఈ నెల 28 నుంచి డిసెంబర్‌ 3 వరకు పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి. కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది.

మలక్కా జలసంధి ప్రాంతాల్లో వాయుగుండం కొనసాగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా నెమ్మదిగా కదులుతూ రాబోయే 36 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని వెల్లడించింది. గురువారం నుంచి మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళరాదని హెచ్చరించింది.

నైరుతి బంగాళాఖాతం, దక్షిణ శ్రీలంక మరియు హిందూ మహాసముద్రం మీదుగా మరో అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. ఇది మరో 12 గంటల్లో ఉత్తర-వాయువ్య దిశగా కదులుతూ తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందంది. ఆ తదుపరి 24 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వివరించింది. వీటి ప్రభావంతో శనివారం నుంచి మంగళవారం వరకు (నవంబర్ 29 నుంచి డిసెంబర్ 2) కోస్తాంధ్ర, రాయలసీమలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రైతులు అప్రమత్తమై వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

Next Story