ఈశాన్య భారతదేశంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు తొమ్మిది రాష్ట్రాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అదే సమయంలో ఢిల్లీలో వాతావరణంలో ఎలాంటి మార్పులు ఉండవు.
దక్షిణ భారతదేశంలో లక్షద్వీప్, కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, కోస్తా, దక్షిణ ఇంటీరియర్ కర్ణాటకలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అక్టోబర్ 9న ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక, రాయలసీమ, తెలంగాణ, కోస్తాంధ్ర, యానాంలో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఈశాన్య భారతదేశంలో అరుణాచల్ ప్రదేశ్, అసోం, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, మేఘాలయలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.వాయువ్య, పశ్చిమ, తూర్పు, మధ్య భారతంలో వర్షపాతం ఉండదని.. వాతావరణం సాధారణంగానే ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఢిల్లీలో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని గరిష్ట పగటి ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్కు చేరుకునే అవకాశం ఉందని తెలిపింది. కనిష్ఠ పగటి ఉష్ణోగ్రత 23 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యే అవకాశం ఉంది.