GHMC పరిధిలో భారీ వర్షం పడే ఛాన్స్: వాతావరణశాఖ
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ పరిధిలో భారీ వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది.
By Srikanth Gundamalla
GHMC పరిధిలో భారీ వర్షం పడే ఛాన్స్: వాతావరణశాఖ
వాతావరణశాఖ కీలక ప్రకటన చేసింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో భారీ వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది. దాంతో.. జీహెచ్‌ఎంసీ అధికారులు అలర్ట్ అయ్యారు. నగరవాసులను అప్రమత్తం చేశారు.
తెలంగాణ వ్యాప్తంగా ఐదురోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సోమవారం ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్‌లో వర్షాలు పడతాయని వివరించింది వాతావరణ శాఖ. అయితే.. హైదరాబాద్‌లో వర్షం భారీగా ఉంటుందని వాతావరణశాఖ అంచనా వేసింది. దీనిపై స్పందించిన జీహెచ్‌ఎంసీ అధికారులు నగరవాసులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వర్షం కారణంగా ఇబ్బందులు తలెత్తితే టోల్ ఫ్రీ నెంబర్లు 040 2111 1111, 90001 13667కు సమాచారం అందించాలని తెలిపారు.
తెలంగాణలో పలు జిల్లాల్లో ఆదివారం మోస్తరు వర్షం కురిసింది. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం గిమ్మ గ్రామంలో పిడుగుపాటుకి ఒకరు ప్రాణాలు కోల్పోగా.. నలుగురికి గాయాలు అయ్యాయి. సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో కూడా గాలివాన వచ్చింది. ఇక సోమవారం కూడా ఇలాగే ఆయా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పడంతో రైతులు అప్రమత్తం అవుతున్నారు. ధాన్యం రాశులను జాగ్రత్త పరిచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. టార్ఫాలిన్ కవర్లను ఏర్పాటు చేసుకుంటున్నారు.
మరోవైపు సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కొన్ని చోట్ల ఎండలు దంచికొడుతుంటే.. మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. మరి ఈ వాతావరణ పరిస్థితులు ఓటింగ్‌పై ఎంత వరకు ప్రభావితం చూపిస్తాయో..! ఎలక్షన్ అధికారులు మాత్రం ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతున్నారు. భవిష్యత్ కోసం ముందుకు వచ్చి తమ ఓటు వేయాలని సూచిస్తున్నారు.