ఆంధ్రప్రదేశ్‌లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండగా , పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు . ఉత్తరాంధ్రతో పాటు కోస్తాంధ్ర, రాయలసీమల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కొన్నిచోట్ల రైతుల పంటలు దెబ్బతింటున్నాయి. భారీ వర్షాల కారణంగా పంటలు దెబ్బతిన్నాయని, ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
ఆది, సోమవారాల్లో రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ నెల 18న అండమాన్ దీవులకు ఉత్తరాన ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని, ఈ ఉపరితల ఆవర్తనం 20న వాయుగుండంగా మారే అవకాశం ఉందని అంచనా. వాయుగుండం తుఫాన్‌గా మారే అవకాశం ఉందని, దీని ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఇప్పటికే తమిళనాడు తీరం వెంబడి దక్షిణ కోస్తాంధ్రలో సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రానున్న రెండు రోజుల పాటు ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు.