Telangana: భారీ వర్షాలు..ఆ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉపరితల ఆవర్తనంతో ఆదివారం మొదలైన వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తూనే ఉంది.
By Srikanth Gundamalla
Telangana: భారీ వర్షాలు..ఆ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉపరితల ఆవర్తనంతో ఆదివారం మొదలైన వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తూనే ఉంది. కొన్ని చోట్ల అయితే భారీ వర్షాలు నమోదు అవుతున్నాయి. ఆగకుండా వానలు కురుస్తుండటంతో జనాలు కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక ఆఫీసులకు వెళ్లే వారు వర్షంలో తడవక తప్పడం లేదు. అత్యవసర పరిస్థితుల్లో బయట తిరిగే వారికి కష్టాలు తప్పడం లేదు. సోమవారం ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో కుండ పోత వాన కురిసింది. మిగిలిన జిల్లాల్లో కూడా విస్తారంగా వర్షాలు పడ్డాయి.
భారీ వర్షాలు కురవడంతో అక్కడక్కడ వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. కొన్ని చోట్ల వరద ఒక్కసారిగా సంభవించడంతో రోడ్లు తెగిపోయాయి. దాంతో.. రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. ఇక హైదరాబాద్ మహానగరంలోనూ భారీ వర్షాలు పడుతున్నాయి. దాంతో విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది. ఎడతెరిపిలేకుండా వర్షాలు పడుతున్న కారణంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కుండపోత వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ జీహెచ్‌ఎంసీ అధికారులు, డిజాస్టర్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని చెబుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో అయితే.. పలుచోట్ల వర్షం బీభత్సం సృష్టించింది. లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. కుండపోత వానతో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇళ్ల నుంచి బయటకు ఎవరూ రావొద్దంటూ జీహెచ్‌ఎంసీ అలర్ట్ ప్రకటించింది. ఈదురు గాలుల కారణంగా పలుచోట్ల చెట్లు నేలకొరిగాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.
మంగళ, బుధ వారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. 7 జిల్లాలకు రెడ్ హెచ్చరికలు, 17 జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు, 9 జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్, మెదక్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలకు రెండ్ అలెర్ట్ జారీ చేశారు. ఇక జగిత్యాల, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, మంచిర్యాల, ములుగు, నారాయణపేట, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, వరంగల్, హనుమకొండ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు వాతావరణశాఖ అధికారులు.