Rain Alert : 36 గంటల్లో 47 మంది మృతి.. 14 రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు భారీ వర్షాలు

పశ్చిమ హిమాలయ రాష్ట్రాల నుంచి ఈశాన్య భారతం వరకు దాదాపు అన్ని రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి

By Medi Samrat  Published on  13 Sept 2024 10:51 AM IST
Rain Alert : 36 గంటల్లో 47 మంది మృతి.. 14 రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు భారీ వర్షాలు

పశ్చిమ హిమాలయ రాష్ట్రాల నుంచి ఈశాన్య భారతం వరకు దాదాపు అన్ని రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమాన రాజస్థాన్, మధ్య భారతదేశంలోని మధ్యప్రదేశ్, తూర్పు భారతదేశంలోని ఒడిశా, జార్ఖండ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు 36 గంటల్లో 47 మంది ప్రాణాలు కోల్పోయారు. వీటిలో ఉత్తరప్రదేశ్‌లో 32, మధ్యప్రదేశ్‌లో 11, రాజస్థాన్‌లో నలుగురు మరణించారు. గోడలు, ఇళ్లు కూలడం వల్లే ఎక్కువ మరణాలు సంభవించాయి. ఈ ప్రమాదాల్లో 38 మంది గాయపడ్డారు.

ఉత్తరాఖండ్‌లో వర్షం కార‌ణంగా కొండచరియలు విరిగిపడటంతో పరిస్థితి దారుణంగా ఉంది. కేదార్‌నాథ్ యాత్రను నిలిపివేసి, రాష్ట్రంలోని అన్ని పాఠశాలలను శుక్రవారం మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. హిమాచల్, ఉత్తరాఖండ్ సహా 14 రాష్ట్రాల్లో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

రానున్న మూడు రోజుల పాటు ఉత్తర, ఈశాన్య రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, హిమాచల్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, పశ్చిమ బెంగాల్, ఒడిశా, జార్ఖండ్ ల‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు ప‌డ‌తాయ‌ని పేర్కొంది.

Next Story