తెలంగాణలో నేడు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. రేపు, ఎల్లుండి అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణ వైపునకు కింది స్థాయిలోని గాలులు వాయువ్య దిశ నుంచి వీస్తున్నాయని, ఈ నెల 20న వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 5.8 కి.మీ ఎత్తు వరకు కొనసాగుతుందని స్పష్టం చేసింది.
అల్పపీడన ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలోని ఐదు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు వేటకు వెళ్లకుండా ఇళ్లలోనే ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి, తూర్పుగోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇదిలావుండగా.. రానున్న మూడు రోజుల పాటు రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.