అల‌ర్ట్‌ : 234 మండలాల్లో వేడిగాలులు.. ఆ స‌మ‌యంలో బ‌య‌ట‌కు రావ‌ద్ద‌ని సూచ‌న‌

రాష్ట్రవ్యాప్తంగా 234 మండలాల్లో మంగళవారం వేడిగాలులు వీచే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ‌ తెలిపింది.

By Medi Samrat  Published on  30 April 2024 9:45 AM IST
అల‌ర్ట్‌ : 234 మండలాల్లో వేడిగాలులు.. ఆ స‌మ‌యంలో బ‌య‌ట‌కు రావ‌ద్ద‌ని సూచ‌న‌

రాష్ట్రవ్యాప్తంగా 234 మండలాల్లో మంగళవారం వేడిగాలులు వీచే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ‌ తెలిపింది. APSDMA మేనేజింగ్ డైరెక్టర్ R కూర్మనాధ్ ఒక ప్ర‌క‌ట‌నలో.. 234 మండలాల్లో 61 మండలాల్లో తీవ్రమైన వేడి గాలుల‌ను ఎదుర్కొనే అవకాశం ఉందని.. 173 వేడి గాలులను చూసే అవకాశం ఉందని అంచనా వేశారు. శ్రీకాకుళం జిల్లా (13 మండలాలు), విజయనగరం (24), పార్వతీపురం మన్యం (14), అనకాపల్లి (తొమ్మిది), విశాఖపట్నం జిల్లాలోని పద్మనాభం మండలాల్లో తీవ్రమైన వేడిగాలులు వీచే అవకాశం ఉందని ఆయన ప్రకటనలో తెలిపారు.

శ్రీకాకుళం జిల్లాలోని 13 మండలాలు, విజయనగరంలో మూడు, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లిలో తొమ్మిది, విశాఖపట్నంలో రెండు, పార్వతీపురం మన్యంలో ఒక మండ‌లంలో వేడిగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. అలాగే కాకినాడ, పల్నాడులోని 19 మండలాల్లో, తూర్పుగోదావరి (18), ప్రకాశం (16), గుంటూరు (15), ఏలూరు (12), కృష్ణా (10), కోనసీమ (ఏడు), ఎన్టీఆర్ (ఆరు) మండలాల్లో వేడిగాలులు వీచే అవకాశం ఉంది. , బాపట్ల, తిరుపతి (నాలుగు చొప్పున), పశ్చిమ గోదావరి (మూడు), నెల్లూరు (రెండు), అన్నమయ్య (ఒకటి) చొప్పున మండ‌లాల్లో వేడి గాలులు వీచే అవ‌కాశం ఉంద‌ని వెల్ల‌డించారు.

సోమవారం నంద్యాల జిల్లా ఆత్మకూరులో గరిష్టంగా 46 డిగ్రీల సెల్సియస్, కడప జిల్లా సింహాద్రిపురం (45.9 సి), విజయనగరం జిల్లా రామభద్రపురం (45.1 సి) నమోదయ్యాయని వాతావ‌ర‌ణ శాఖ వెల్ల‌డించింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం కర్నూలు జిల్లా కోడుమూరులో 44.8 డిగ్రీల సెల్సియస్, పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో 44.5 డిగ్రీల సెల్సియస్, నెల్లూరు జిల్లా రావూరులో 44.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రజలు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇళ్లలోనే ఉండాలని.. వృద్ధులు, పాలిచ్చే మహిళలు జాగ్రత్తలు తీసుకోవాలని కూర్మనాధ్ సూచించారు.

Next Story