దక్షిణ కోస్తాంధ్ర తీరాలకు చేరువలోకి రానున్న తీవ్ర వాయుగుండం
Cyclone Mandous Intensifies Heavy Rains Thunderstorms Likely Over Tamil Nadu Ap. బంగాళాఖాతంలో వాయుగుండం మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారింది.
By M.S.R Published on 7 Dec 2022 5:18 PM ISTబంగాళాఖాతంలో వాయుగుండం మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారింది. ప్రస్తుతం ఆగ్నేయ, నైరుతి బంగాళాఖాతాలను ఆనుకుని ఉన్న ఈ తీవ్ర వాయుగుండం చెన్నైకి తూర్పు ఆగ్నేయ దిశగా 770 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది క్రమేపీ పశ్చిమ వాయవ్య దిశగా కదిలి నేటి సాయంత్రానికి తుపానుగా రూపాంతరం చెందనుంది.
డిసెంబరు 8:
డిసెంబరు 8 ఉదయానికి ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి, దక్షిణ కోస్తాంధ్ర తీరాలకు చేరువలోకి రానుంది. దీని ప్రభావంతో డిసెంబరు 8న తమిళనాడు, పుదుచ్చేరి తీర ప్రాంతం, కారైక్కాల్ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. అదే సమయంలో ఏపీ దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
డిసెంబరు 9:
డిసెంబరు 9న ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ఐఎండీ హెచ్చరించింది.
డిసెంబరు 10:
డిసెంబరు 10న తుపాను తీవ్రత కాస్త తగ్గుతుందని, ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలోని చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడొచ్చని వివరించింది.
బుధవారం సాయంత్రం నుంచి తీర ప్రాంత జిల్లాల్లో గాలుల తీవ్రత పెరగనుంది. డిసెంబరు 8 సాయంత్రం నుంచి డిసెంబరు 9వ తేదీ ఉదయం వరకు 100 కిమీ వేగంతో గాలులు వీస్తాయని, ఆపై క్రమంగా గాలుల వేగం తగ్గుతుందని ఐఎండీ పేర్కొంది. నేటి నుంచి సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, ఈ నెల 10వ తేదీ వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేసింది.