మిచౌంగ్ ఎఫెక్ట్: తెలంగాణలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
మిచౌంగ్ తుపాను తీరాన్ని తాకింది.
By Srikanth Gundamalla Published on 5 Dec 2023 9:52 AM GMTమిచౌంగ్ ఎఫెక్ట్: తెలంగాణలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
మిచౌంగ్ తుపాను తీరాన్ని తాకింది. మరో గంట వరకు పూర్తిగా తీరం దాటనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ తుపాను బాపట్ల సమీపంలో తీరాన్ని తాకినట్లు చెప్పారు. సాయంత్రానికి బలహీనపడి వాయుగుండంగా మారేఅవకాశాలు ఉన్నాయని అధికారులు చెప్పారు. తీపాను తీరం దాటుతున్న సమయంలో బాపట్ల తీర ప్రాంతాల్లో భారీగా గాలులు వీచాయని.. భారీ వర్షం కురిసిందని చెప్పారు. సముద్రంలో అలలు సుమారు 2 మీటర్ల మేర ఎగిసిపడుతున్నాయని వెల్లడించారు. మరోవైపు తుపాను ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. రాయలసీమ ప్రాంతంలోని కొన్ని జిల్లాల్లో కూడా తుపాను ప్రభావం కనిపిస్తోంది. ఇప్పటికే వర్షం కారణంగా పలుచోట్ల వరి, పొగాకు, పసుపు, అరటి పంటలు దెబ్బతిన్నాయి.
ఈ క్రమంలో తెలంగాణలో తుపాను ప్రభావంపైనా హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటన చేసింది. బుధవారం వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. అలాగే భూపాపల్లి, కరీంనగర్, పెద్దపల్లి, జనగామ, నల్లగొండ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలతో పాటు ఈదురుగాలులు ఉంటాయని వెల్లడించింది. ఇప్పటికే తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రేపటి వరకు వర్షాలు ఇలానే కొనసాగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.
బుధవారం రోజు కూడా భారీ వర్ష సూచనల ఉన్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జ సూచించారు. ఈ మేరకు వర్ష ప్రభావం తీవ్రంగా ఉండే ఆయా జిల్లా కలెక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. భద్రాద్రి, ములుగు జిల్లాలకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే నిండిన చెరువులకు గండ్లు పడకుండా చర్యలు తీసుకోవాలనీ.. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసి సహాయక చర్యలు అందించాలని ఆయన సూచించారు.