ఆంధ్రప్రదేశ్‌కి బిగ్ అలర్ట్.. మూడు రోజులు భారీ వర్షాలు
Coming Three days Heavy Rain Alert in AP.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో తుఫాను ముప్పు పొంచి ఉంది. శనివారం ఉత్తర
By తోట వంశీ కుమార్ Published on 16 Nov 2021 1:26 PM IST
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో తుఫాను ముప్పు పొంచి ఉంది. శనివారం ఉత్తర అండమాన్ సముద్రం, దాన్ని ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడిన సంగతి తెలిసిందే. ఇది మరింత బలపడి వాయుగుండంగా మారి 17,18 తేదీల్లో తుఫానుగా మారే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం చెప్పింది. ఈ నెల 18న దక్షిణ ఆంధ్రప్రదేశ్-ఉత్తర తమిళనాడు తీరానికి చేరే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్ర సంచాలకులు స్టెల్లా తెలిపారు. దీని ప్రభావంతో మంగళ, బుధ వారాల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు, అనేక చోట్ల తేలికపాటి నుంచి మోసార్లు వర్షాలు కురుస్తాయన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తీరానికి ప్రస్తుతం 1,200 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ తుఫాన్‌కి "జవాద్"గా నామకరణం చేశారు. వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ఎదుర్కొనేందుకు అధికారులు సిద్దంగా ఉండాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో ముసురు వాతావరణం కొనసాగుతోంది. అధికశాతం ప్రాంతాల్లో చినుకులు పడుతూనే ఉన్నాయి. కొద్ది సేపు ఎండ, ఆ వెంటనే జల్లులు కురుస్తున్నాయి. సోమవారం ఉదయం 8.30గంటల నుంచి రాత్రి 8 గంటల మధ్య అత్యధికంగా చిత్తూరు జిల్లా సోమలలో 6.4 సెం.మీ, తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరం మండలం అంగరలో 6.3, మండపేటలో 4.9 సెం.మీ చొపపున వర్షం కురిసింది. ఇప్పటికే అకాల వర్షాలకారణంగా తీవ్రంగా పంట నష్టం జరిగింది.