ఏపీలో పలు జిల్లాలో భారీ వర్షాలు.. మరికొన్ని చోట్ల దంచికొడుతున్న ఎండ

ఏపీలో కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుంటే.. మరికొన్ని చోట్ల మాత్రం విచిత్రంగా ఎండలు దంచికొడుతున్నాయి.

By Srikanth Gundamalla  Published on  30 Oct 2023 6:00 AM GMT
andhra pradesh, weather report, rains,

ఏపీలో పలు జిల్లాలో భారీ వర్షాలు.. మరికొన్ని చోట్ల దంచికొడుతున్న ఎండ

ఏపీలో విచిత్ర వాతావరణ కనిపిస్తోంది. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుంటే.. మరికొన్ని చోట్ల మాత్రం విచిత్రంగా ఎండలు దంచికొడుతున్నాయి. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని కారణంగానే ఆంధ్రప్రదేశ్‌లో పలు చోట్ల తేలికపాటి వానలు కురుస్తున్నాయని వాతావరణశాఖ చెబుతోంది. అయితే.. సోమవారం గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు వెల్లడించారు. కాగా.. ఉపరితల ఆవర్తనం కారణంగా పలు చోట్ల భారీ వర్షపాతం నమోదు అయ్యింది. పశ్చిమగోదావరి జిల్లాలోని నర్సాపురంలో 4.5 సెంటీమీటర్ల వర్షపాతం, తిరుపతిలో 1.4 సెం.మీ, సత్యవేడులో 1.2 సెం.మీ, అన్నమయ్య జిల్లాలో 1.2, భీమవరం, గూడురు, నెల్లూరు జిల్లా సీతారామపురంలో సాధారణ వర్షపాతం నమోదు అయ్యింది. బంగాళాఖాతంలో ఉపరితలం కారణంగా ఇవాళ కూడా ఆయా ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

ఇక మరోవైపు ఏపీలోని పలు ప్రాంతాల్లో పగలంతా ఎండలు తీవ్రంగా దంచికొడుతున్నాయి. సాయంత్రం కాగానే చలిగాలులు వీస్తున్నాయి. అక్టోబరు నెలాఖరు అయినా సరే పగటి పూట ఎండాకాలాన్ని తలపిస్తోంది. నెల రోజులుగా పలుచోట్ల గరిష్ట ఉష్ణోగ్రతలు 31 నుంచి 33 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. ఇక ఇప్పుడు పగలు ఎండలు దంచికొడుతున్నా.. రాత్రిళ్లు కాగానే చలి తీవ్రంగా ఉంటోంది. అక్టోబరు నెలలో సాధారణంగా మంచి వర్షపాతం నమోదు కావాలి. కానీ ఈ ఏడాది ఎండాకాలం తరహాలో సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నారు. కానీ.. కొన్ని చోట్ల మాత్రమే వర్షాలు కురుస్తున్నాయి. ఆయా ప్రాంతాల్లో జనాలకు ఉక్కపోత తప్పడం లేదు.

ఇక తెలంగాణలోనూ ఇదే తరహాలో వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. పగలు ఎండ తీవ్రంగా ఉంటోంది. సాయంకాలం అవ్వగానే చల్లగాలులు వీస్తున్నాయి. మరో వైపు రాజధాని నగరంలో అయితే.. రాత్రిళ్లు ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి.

Next Story