తెలుగు రాష్ట్రాల్లో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు: వాతావరణశాఖ
తెలంగాణలోని పలు జిల్లాలతో పాటు.. ఏపీలో కూడా పలు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
By Srikanth Gundamalla Published on 18 Aug 2024 6:39 AM ISTతెలుగు రాష్ట్రాల్లో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు: వాతావరణశాఖ
ఉత్తర కర్ణాటకను ఆనుకుని ఉన్న తెలంగాణ ప్రాంతంలో ఆవర్తనం విస్తరించి ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. దీని ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాలతో పాటు.. ఏపీలో కూడా పలు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అయితే.. దీని ప్రభావంతోనే ఆదివారం ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అలాగే కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్‌ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
అలాగే సోమవారం కూడా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్నదని హెచ్చరించారు. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశువుల కాపరులు చెట్ల కింద, పోల్స్, టవర్స్ కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించారు.
మరోవైపు తెలంగాణలో కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. ఆదివారం రాష్ట్రంలోని పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారులు చెప్పారు. ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని చెప్పారు. ఇవాళ నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణ పేట, జోగులాంబ గద్వాల, హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కాగా.. శనివారం సాయంత్రం హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. రోడ్లపైకి వర్షం నీరు వచ్చి చేరింది. దాంతో.. వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది.