తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ వర్షాలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్

తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

By Srikanth Gundamalla  Published on  4 Aug 2024 3:00 AM GMT
andhra pradesh, telangana, rain alert, weather ,

 తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ వర్షాలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ 

తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అధికారులు చెప్పారు. దక్షిణాది రాష్ట్రాల్లో రుతుపవనాలు చాలా యాక్టివ్‌గా ఉన్నాయని అన్నారు. తెలుగు రాష్ట్రాలపై కూడా ద్రోణి ప్రభావం ఉందన్నారు. గుజరాత్, కేరళ దగ్గర కూడా మరో ద్రోణి కొనసాగుతోందని వెల్లడించారు. వీటి ప్రభావంతో తెలంగాణ సహా ఏపీలోని పలు చోట్ల వర్షాలు పడతాయని అధికారులు చెప్పారు.

తెలుగు రాష్ట్రాల్లో అల్పపీడనం కారణంగా మేఘాలు కమ్ముకుని ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. కొంచెం ఉక్కపోత కూడా ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. సాయంత్రం 4 తర్వాత పశ్చిమ తెలంగాణలో జల్లులతో కూడిన వర్షం మెుదలవుతుందని వెల్లడించారు. ప్రధానంగా సిరిసిల్ల, ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, మంచిర్యాల, కొత్తగూడెం, కామారెడ్డి, సిద్దిపేట, మెదక్‌, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలకు ఛాన్స్ ఉందన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.రాష్ట్రంలో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో పాటు ఈదుగుగాలులు వీస్తాయని చెప్పారు. గంటకు 30-40 కి.మీ వేగంగా గాలులు వీస్తాయన్నారు. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్, జార్ఖండ్, బీహార్‌లలోనూ నేడు చాలా చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది.

ఉత్తర కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం ఒకటి లేదా రెండుచోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలోనూ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈదురు గాలులు కొన్ని చోట్ల 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో కూడా వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Next Story