మూడ్రోజుల పాటు ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన
వాతావరణ శాఖ అధికారులు రెండు తెలుగు రాష్ట్రాల్లో రాబోయే మూడ్రోజుల పాటు భారీ వర్షాలు పడుతాయని సూచించారు.
By Srikanth Gundamalla Published on 30 Jun 2024 1:45 PM ISTమూడ్రోజుల పాటు ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన
తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి. చాలా చోట్ల వాతావరణం చల్లగానే ఉన్నా.. వానలు పడలేదు. ఈక్రమంలోనే వాతావరణ శాఖ అధికారులు రెండు తెలుగు రాష్ట్రాల్లో రాబోయే మూడ్రోజుల పాటు భారీ వర్షాలు పడుతాయని సూచించారు. తెలంగాణలో భారీ వర్షాలు పడే చాన్స్ ఉందన్నారు. భాగ్యనగరంలో ఆకాశం మేఘావృతమై ఉంటుందని వెల్లడించారు. ఆదిలాబాద్, పెద్దపల్లి, నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, కొమురంబీం, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, మహబూబాబాద్, కరీంనగర్, భూపాలపల్లి సహా ములుగు జిల్లాకు వాతావరణశాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
అలాగే ఏపీలోని పలు జిల్లాలకు కూడా వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అక్కడా మూడ్రోజులు వర్షాలు పడుతాయని చెప్పారు అధికారులు. తేలికపాటి నుంచి.. మోస్తరు వానలు పడతాయని వెల్లడించారు. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. అమలాపురం, కాకినాడ, నెల్లూరు, ఒంగోలు, బాపట్ల, గన్నవరం, మచిలీపట్నం, భీమవరం, అన్నవరం ప్రాంతాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నంద్యాల, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసే ఛాన్స్ ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
బంగాళాఖతంలో అల్పపీడనం కొనసాగుతోందని వాతావరణశాఖ వెల్లడించింది. అలాగే ఉత్తర ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరాలకు ఆనుకుని ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని తెలిపింది. సముద్ర మట్టానికి 7.6 కి.మీ ఎత్తులో నైరుతి దిశలో ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణశాఖ తెలిపింది. అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వివరించింది.