Andhra Pradesh: రాష్ట్ర ప్రజలకు వాతావరణశాఖ వార్నింగ్

ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు దంచికొడుతున్నాయి.

By Srikanth Gundamalla
Published on : 29 April 2024 7:27 AM IST

andhra pradesh, summer,  temperature, weather,

 Andhra Pradesh: రాష్ట్ర ప్రజలకు వాతావరణశాఖ వార్నింగ్ 

ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు దంచికొడుతున్నాయి. ఎండ వేడిమి... వడగాల్పులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 9 దాటిందంటే చాలు భానుడి ప్రతాపంతో ప్రజలు బయటకురాలేకపోతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఇళ్ల నుంచి బయటకు వెళ్లిన వారు ఎండ వేడిమికి గురై అనారోగ్యం పాలవుతున్నారు. మరోవైపు రాష్ట్రంలో వేడి గాలులు వీస్తున్నాయి. దక్షిణ, నైరుతి దిశ నుంచి వీస్తున్న పొడిగాలుల కారణంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతున్నాయి. రానున్న నాలుగు రోజుల్లో వడగాల్పుల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

సోమవారం ఆంధ్రప్రదేశ్‌లోని 47 మండలాల్లో తీవ్ర వడగాలులు, 15 మండలాల్లో వడగాలులు ఉంటాయని విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ఇళ్ల నుంచి బయటకు వచ్చే వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు అధికారులు. అంతేకాదు.. మే 1వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర వడగాల్పులు వీస్తామని వాతావరణశాఖ హెచ్చరించింది. కొన్ని ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీ ల వరకు అధికంగా నమోదు అవుతాయని చెప్పింది.

ఆదివారం రాష్ట్రంలోనే అత్యధికంగా నంద్యాల జిల్లా నందికొట్కూరు, కడప జిల్లా చాపాడులో 45.9, కర్నూలు జిల్లా గూడురులో 45.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. విజయనగరం జిల్లా రామభద్రపురంలో 45.2, పార్వతీపురం మన్యం జిల్లా మక్కువలో 45.1, పల్నాడు జిల్లా నరసరావుపేటలో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. 68 మండలాల్లో తీవ్ర వడగాలులు, 120 మండలాల్లో వడగాలులు వీచాయని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. ప్రజలు వీలైనంతవరకు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంట్లోనే ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

Next Story