తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలకు కొద్ది రోజులు వేడి నుంచి ఉపశమనం లభించనుంది. వేసవి కాలం కావడంతో గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో భానుడు మండిపోతున్నాడు. ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటేనే ఓ సారి ఆలోచించే పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. పలు చోట్ల చిరు జల్లులు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
ఛత్తీస్‌గఢ్ నుంచి విదర్భ, తెలంగాణ మీదుగా కర్ణాటక వరకు ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావం వల్ల దేశంలోని తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి తెలంగాణ రాష్ట్రంలోకి దిగువ స్థాయి గాలులు వీస్తున్నాయి. ఫలితంగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ నెల 16 నుంచి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. 20 తేదీ వరకు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా తక్కువగా నమోదయ్యే అవకాశాలున్నట్లు అంచనా వేసింది.
ఇదిలా ఉంటే.. శనివారం గరిష్ఠ ఉష్ణోగ్రతలన్నీ సాధారణం కన్నా తక్కువగా నమోదయ్యాయి. హైదరాబాద్‌లో సాధారణం కన్నా 2.6 డిగ్రీలు తక్కువగా 32.7 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఈ రోజు కూడా సాధారణం కన్నా తక్కువగానే ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉంది.