రాబోయే 48 గంటల్లో అల్పపీడనం: ఐఎండీ

By సుభాష్  Published on  30 May 2020 2:06 PM GMT
రాబోయే 48 గంటల్లో అల్పపీడనం: ఐఎండీ

భారత వాతావరణ శాఖ దేశ ప్రజలకు, రైతులకు గుడ్‌న్యూస్‌ వినిపించిన విషయం తెలసిందే. ఒక వైపు దేశంలో కరోనా వైరస్‌ తీవ్ర స్థాయిలో విజృంభిస్తుంటే .. మరో వైపు ఎండలు మండిపోతున్నాయి. ఎన్నడు లేనంతగా ఎండలు తీవ్రంగా ఉండటంతో జనాలు ఉక్కిరిబిక్కరవుతున్నారు. ఇక తాజాగా ఐఎండీ చల్లని కబురు చెప్పింది. జూన్‌ 1వ తేదీ నాటికే దేశంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశాలు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. మే 31న ఆగ్నేయ, పక్కనే ఉన్న తూర్పు మధ్య ఆరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, ఈ కారణంగా రుతుపవనాలు సకాలంలో ప్రవేశించే అవకాశాలు మెండుగా ఉన్నాయిన తెలిపింది.

ఆగ్నేయ అరేబియా మహాసముద్రంలో మలదీవ్‌ ప్రాంతాల్లో రానున్న 24 గంటల్లో నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశాలున్నాయని పేర్కొంది. రాబోయే 48 గంటల్లో తూర్పు మధ్య అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని ఐఎండీ అసిస్టెంట్ డైరెక్టర్‌ నాగరత్నం తెలిపారు. 48 గంటల తర్వాత ఈ అల్పపీడనం తూర్పు మధ్య అరేబియా సముద్రం గుండా కదలి వాయుగుండంగా ఏర్పడే అవకాశాలున్నాయన్నారు. జూన్‌ 1 వరకూ నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నాయని వెల్లడించారు. ఛత్తీస్‌గఢ్‌ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా దక్షిణ కర్ణాటక వరకు 5.9 మీటర్ల దూరంలో ఒక ద్రోణి కనసాగుతోందన్నారు. దీని ప్రభావంతో తెలంగాణ ప్రాంతంలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఇక రాబోయే 24 గంటల్లో తెలంగాణ జిల్లాల్లో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు.

Next Story