జూన్‌ 8వ తేదీ వరకూ పొడిగింపు: సీఎం కేసీఆర్

By సుభాష్  Published on  30 May 2020 12:12 PM GMT
జూన్‌ 8వ తేదీ వరకూ పొడిగింపు: సీఎం కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాలను జూన్‌ 8వ తేదీ వరకూ కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖ అధికారులకు శనివారం ఆదేశాలు జారీ చేశారు. ముందుగా రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను మే 31 వరకే నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించగా, తాజాగా జూన్‌ 8 వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

కాగా, రాష్ట్రంలో లాక్‌డౌన్‌ కొనసాగుతుండటం, గత వారం రోజులుగా వర్షాలు తదితర కారణాలతో ధాన్యం సేకరణ పూర్తిగా నిలిచిపోవడం వల్ల మరి కొన్ని రోజులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను కొనసాగించాలని పలువురు ప్రభుత్వాన్ని కోరగా, దీనిపై సమీక్షించిన కేసీఆర్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

అంతేకాదు తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ధాన్యం పండించిన నేపథ్యంలో చివరి వరకూ కొనుగోళ్లు చేయాలని ప్రభుత్వం గతంలో నిర్ణయించింది. ఇక అకాల వర్షాలతో రైతులు తీవ్ర ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సీఎం కేసీఆర్‌ కొనుగోలు కేంద్రాలను పొడిగించారు. వర్షాలు రాకముందే రైతులు తమ తమ పంటలను కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి అమ్ముకోవాలని కేసీఆర్‌ సూచించారు.

Next Story