చైనా ఎంతైతే ఇస్తుందో అంతే ఇస్తాం..!

By Newsmeter.Network  Published on  16 May 2020 6:43 AM GMT
చైనా ఎంతైతే ఇస్తుందో అంతే ఇస్తాం..!

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో.. ఎవరిపై ఎప్పుడు ఆగ్రహంతో ఊగిపోతారో అర్థంచేసుకోవటం కష్టం. ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థపై ట్రంప్‌ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా డబ్ల్యూహెచ్‌వోకు అమెరికా అదించే నిధులను నిలిపివేస్తామని హెచ్చరించారు. కాగా ప్రస్తుతం ట్రంప్‌ తన నిర్ణయాన్ని వెనక్కితీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని అమెరికాలోని ప్రముఖ మీడియా సంస్థ ఫాక్స్‌ బిజినెస్‌ వెల్లడించింది. గతంలో ఇచ్చేవిధంగా పూర్తిస్థాయి నిధులు కాకుండా తగ్గించి నిధులు అందించేందుకు ట్రంప్‌ అంగీకరించినట్లు, అంటే చైనా ఎంత ఇస్తుందో అమెరికా కూడా అంతే ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. గతంలో డబ్ల్యూహెచ్‌వోకు అమెరికా చెల్లించిన దానితో పోలిస్తే ఇది పదోవంతు. ఈ మేరకు లభించిన ఓ ముసాయిదాపత్రాన్ని 'ఫాక్స్‌ బిజినెస్‌' ప్రచురించింది.

Also Read :24గంటల్లోనే 3,970 పాజిటివ్‌ కేసులు, 103 మంది మృతి

కరోనా వైరస్‌తో ప్రపంచ దేశాలు హడలిపోతున్నాయి. అగ్రరాజ్యమైన అమెరికాసైతం ఈ మహమ్మారితో అతలాకుతలమైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆ దేశంలో ప్రజలు ఆస్పత్రులపాలయ్యారు. లక్షలాది మంది మృతి చెందారు. అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కరోనా వైరస్‌ వ్యాప్తికి చైనానే కారణం అంటూ మండిపడుతూ వస్తున్నారు. చైనా వల్లనే ప్రపంచ దేశాలు ఇబ్బందులు పడుతున్నాయని, ప్రజలు చనిపోతున్నారని ఆరోపణలు గుప్పిస్తూ వస్తున్నారు. ఇదే సమయంలో డబ్ల్యూహెచ్‌వోపైనా ట్రంప్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైరస్‌ వ్యాప్తి విషయంలో ప్రపంచాన్ని హెచ్చరించడంలో డబ్ల్యూహెచ్‌వో విఫలమైందని ట్రంప్‌ బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్ల్యూహెచ్‌వో వైరస్‌పై హెచ్చరించి ఉండుంటే చైనా నుంచి అమెరికాకు రాకపోకలను అడ్డుకొనేవాళ్లమని, చైనాకు పక్షపాతిగా డబ్ల్యూహెచ్‌వో వ్యవహరించిందని ఆరోపించారు. అంతేకాకుండా అమెరికా నుంచి డబ్ల్యూహెచ్‌వోకు వెళ్లే నిధులను నిలిపివేస్తున్నామని ట్రంప్‌ తెలిపారు. దీంతో ఏప్రిల్‌ 14నుంచి ట్రంప్‌ డబ్ల్యూహెచ్‌వోకు వెళ్లే నిధులను నిలిపివేశారు. కాగా మళ్లి ట్రంప్‌ తన నిర్ణయాన్ని మార్చుకొని చైనా ఎంత చెల్లిస్తుందో అంతే చెల్లించేందుకు నిర్ణయించారు.

Also Read :మొబైల్‌ ఫోన్‌ల ద్వారా కరోనా వైరస్‌ వ్యాప్తి!?

Next Story