మోదీ నిర్ణయానికి మేమూ మద్దతిస్తాం

By Newsmeter.Network  Published on  26 March 2020 9:48 AM GMT
మోదీ నిర్ణయానికి మేమూ మద్దతిస్తాం

కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. 21రోజుల పాటు లాక్‌డౌన్‌ విధిస్తూ నిర్ణయించారు. దీంతో దేశవ్యాప్తంగా ప్రజలు లాక్‌డౌన్‌లో పాల్గొన్నారు. పలువురు బయటకు వచ్చినా పోలీసులు వారికి తిరిగి ఇండ్లకు పంపిస్తున్నారు. దీంతో నాలుగు రోజులుగా ప్రజలు ఇండ్లకే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ మోదీకి లేఖ రాశారు. ఈ లేఖలో కరోనాను తరిమికొట్టేందుకు మీరు తీసుకున్న నిర్ణయం స్వాగతించదగ్గదని, ఈ మహమ్మారిని తరిమికొట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొనే చర్యలకు పూర్తి మద్దతు ఇస్తామని సోనియా పేర్కొన్నారు.

Also Read :కరోనా భయంతో.. అంత్యక్రియలు అడ్డుకున్న గ్రామస్తులు.. చివరికి

ప్రపంచ మానవాళికే వైరస్‌ సవాళ్లు విసురుతున్న ఈ సమయంలో దేశం కోసం, దేశ ప్రజల కోసం వ్యక్తిగత ప్రయోజనాలను పక్కన పెట్టాల్సిన అవసరం ఉందని, నిజమైన మానవత్వం, కర్తవ్యాన్ని నిర్వర్తించడం అవసరమని సోనియా పేర్కొన్నారు. మద్దతు, సహకారం, స్ఫూర్తితో కరోనాను తరిమికొడదాం అని సోనియా లేఖలో తెలిపారు. ఇటీవల కరోనా నియంత్రణలో మోదీ ప్రభుత్వం తగిన విధంగా సిద్ధం కాలేదంటూ కాంగ్రెస్‌ రాహుల్‌ విమర్శలు గుప్పించారు. ఈ తరుణంలో మోదీకి మా మద్దతు అంటూ సోనియా లేఖ రాయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.

Also Read :విమర్శలు కాదు.. ఎంత త్వరగా రెస్పాండ్‌ అయ్యామో చూడాలి

తన లేఖలో సోనియా పలు కీలక సూచనలు చేశారు. ప్రజలను కాపాడే వైద్యులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని, వారి వ్యక్తిగత రక్షణ కోసం కేంద్రం చర్యలు తీసుకోవాలని, ఎన్‌- 95 మాస్కులు, వైద్య పరికరాలు అందుబాటులోకి తేవాలని సోనియా కోరారు. ప్రత్యేక రిస్క్‌ అలవెన్స్‌ ఇస్తే బాగుంటుందని సోనియా ప్రధానికి సూచించారు. ప్రజలంతా ఇదే రీతిలో లాక్‌డౌన్‌ పాటించాలని, వైరస్‌ వ్యాప్తి ఉదృతి తగ్గేవరకు ఎవరూ ఇండ్ల నుంచి బయటకు రావద్దని సోనియా విజ్ఞప్తి చేశారు.

Next Story