విమర్శలు కాదు.. ఎంత త్వరగా రెస్పాండ్‌ అయ్యామో చూడాలి

ప్రపంచ దేశాలను కరోనా వైరస్‌ వణికిస్తుంది. ఈ వైరస్‌ రోజురోజుకు వేగంగా వ్యాపిస్తుంది. ఇప్పటికే ఈ వైరస్‌ భారిన పడి ప్రపంచ వ్యాప్తంగా 18వేలకుపైగా మంది మృతి చెందారు. మరో నాలుగు లక్షల మంది వరకు ఆస్పత్రుల్లో చికిత్సలు పొందుతున్నారు. భారత్‌లోనూ ఈ వైరస్‌ వేగంగా విస్తరిస్తుంది. ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే లాక్‌డౌన్‌కు పిలుపునివ్వడంతో ప్రజలంతా ఇండ్లకే పరిమితమవుతున్నారు. ఇప్పటికే భారత్‌లో 649 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, మృతుల సంఖ్య 13కి చేరింది.

Also Read :పోలీస్‌ చేయి కొరికి.. రక్తాన్నిమరో పోలీస్‌ చొక్కాపై ఉమ్మి..

ఇదిలాఉంటే చైనాలో రెండు నెలలుగా తీవ్రస్థాయిలో విజృంభించిన కరోనా వైరస్‌.. ప్రస్తుతం తగ్గుముఖం పట్టింది. గత మూడు రోజుల నుంచి చైనాలో ఒకటి రెండు మినహా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కావటం లేదు. ఈ నేపథ్యంలో కరోనా మహమ్మారిని అదుపు చేసేందుకు తమ దేశం ఎలాంటి చర్యలు తీసుకుందో చూడాలని, చైనీస్‌ వైరస్‌ అనో, వూహాన్‌ వైరస్‌ అనో ఆరోపించడం సరికాదని ఇండియాలోని చైనా ఎంబసీ అధికార ప్రతినిధి జీ రాంగ్‌ ఖండించారు. ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అదేపనిగా చైనీస్‌ వైరస్‌ అని, వూహాన్‌ వైరస్‌ అని చైనాను దుయ్యబడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జీరాంగ్‌ ఈ వ్యాఖ్యలను ఖండించారు.

Also Read :అలా పడుకుంటే.. ‘కరోనా’ నుంచి ఉపశమనం..!

మా దేశ ప్రజలను విమర్శించే బదులు మేం ఎంత త్వరగా రెస్పాండ్‌ అయ్యామో.. అంతర్జాతీయ దేశాలు గమనించాలని సూచించారు. మేమేమీ దీన్ని క్రియేట్‌ చేయలేదని, కావాలనే వ్యాప్తి చెందింపజేయలేదని ఆయన అన్నారు. అసలు ఈ వైరస్‌ ఎక్కడ నుండి పుట్టిందో శాస్త్రీయ పరిశోధనలు జరగాలని అన్నారు. కరోనాకు సంబంధించి చైనాలోని ఇతర ప్రాంతాలకు, వూహాన్‌ సిటీకి సంబంధం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసిందని ఆయన గుర్తు చేశారు. కరోనా నివారణకు భారత్‌, చైనా దేశాలు రెండూ పరస్పరం సహకరించుకుంటున్నాయని, తమ దేశానికి ఇండియా వైద్య పరికరాలు, మాస్కులు పంపి సహాయం చేసిందని, ఇందుకు భారత్‌కు ఎంతో కృతజ్ఞతలు తెలుపుతున్నామని జీ రాంగ్‌ పేర్కొన్నారు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *