కరోనా వైరస్‌ వేగంగా విస్తరిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఎన్ని పకడ్బందీ చర్యలు చేపట్టినా కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 650మందికి కరోనా పాజిటివ్‌ రాగా, పదకొండు మంది మృత్యువాత పడ్డారు. ఇదే సమయంలో కరోనా వ్యాప్తిని పూర్తిగా అంతమొందించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ లాక్‌డౌన్‌ను విధించారు. లాక్‌డౌన్‌ ద్వారా ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రాకుండా పోలీస్‌ శాఖ పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. పట్టణం నుంచి గ్రామం వరకు ఎవరూ బయటకు రాకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. కేవలం కూరగాయలు, ఇతర నిత్యావసర ధరలను మాత్రం కొనుగోలు చేసేందుకు అదీ కుటుంబం నుంచి ఒక్కరిని రానిస్తున్నారు. అనసరంగా ఎవరైనా రోడ్లపైకి వస్తే లాఠీ దండనతో పాటు కఠిన చర్యలు తీసుకుంటున్నారు.

Also Read :అలా పడుకుంటే.. ‘కరోనా’ నుంచి ఉపశమనం..!

లాక్‌డౌన్‌ సందర్భంగా విధులు నిర్వహిస్తున్న పోలీసుల పట్ల యువతి మూర్ఖంగా ప్రవర్తించింది. పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో ఈ ఘటన చోటు చేసుకుంది. బిదాన్‌ నగర్‌ ప్రాంతంలో లాక్‌డౌన్‌ అమలు చేస్తున్న పోలీసులు అటు వచ్చిన ఓ కారును ఆపారు. ఎందుకు బయట తిరుగుతున్నారు.. లాక్‌ డౌన్‌ ఉందని తెలియదా అంటూ కారులో వారిని పోలీసులు ప్రశ్నించారు. కారులో ఉన్న డ్రైవర్‌, మరో యువకుడిని పక్కకు తీసుకెళ్లి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. కారులోనే ఉన్న 20ఏళ్ల యువతి పోలీసులపై దాడికి దిగింది. ఆమెతో పాటు ఉన్న యువకుడు కూడా పోలీసులతో వాగ్వావాదానికి దిగాడు. ఈ క్రమంలోనే విచక్షణ కోల్పోయిన యువతి ఓ పోలీస్‌ చేతిని కొరికింది.. అంతటితో ఆగకుండా ఆ రక్తాన్ని మరో పోలీస్‌ చొక్కాపై ఉమ్మేసింది. ఈ ఘటనతో షాకైన పోలీసులు వెంటనే ఆమెను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

దీంతో ఈ వీడియోను చూసి నెటిజర్లు యువతి పై మండిపడుతున్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పోలీసులు తమ విధులు నిర్వహిస్తుంటే.. యువతీ తీరు దారుణంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలువురు యువతిపై అన్ని సెక్షన్ల అమలు చేయాలని, కఠినంగా శిక్షించాలని సూచిస్తున్నారు. ఇలాంటి వారిని వదిలిపెట్టొద్దు. ఆమెను చట్టపరంగా కఠినంగా శిక్షిచాలని అంటూ ట్వీట్లు చేస్తున్నారు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.