క‘న్నీటి కష్టాలకు’ చెక్ పెట్టండి.!
By మధుసూదనరావు రామదుర్గం Published on 20 Aug 2020 12:24 PM GMTకడవ మీద కడవ బెట్టి.. కష్టాలను అదిమిపట్టి.. కిలోమీటర్ల లెక్కన కాలినడక నడచి బిందెడు నీటి కోసం పడరాని తిప్పలు పడుతున్న గ్రామీణ మహిళలు పడుతున్న కష్టాలొకవైపు.. పట్టణాల్లోనూ నీళ్ళ కోసం నానా గల్లీల చుట్టూ తిరుగుతూ ఎప్పుదొస్తుందో తెలీని మునిసిపల్ నీటి ట్యాంకు కోసం ఆశగా ఎదురు చూస్తున్న అడవాళ్లు మరోవైపు. ఈ కష్టాల పర్వానికి ఇక చెక్ పెట్టాలనుకుంది వాటర్ వారియర్...వేదిక బండార్కర్. ఏ ఆడబిడ్డ నీళ్ళ కోసం కంటనీరు పెట్టరాదని ఆమె తీవ్రంగా నిర్ణయించుకుంది. అయితే ఈ నిర్ణయం చాలా ఖరీదైనదనే చెప్పాలి. ఎందుకంటే కార్పొరేట్ ప్రపంచంలో స్టార్ బ్యాంకర్‌గా సాధించిన పేరును వదులుకోవాల్సి వచ్చింది. జేపీ మోర్గాన్ ప్రముఖ బ్యాంకులు ఆమె కోసం క్యూకట్టినా వద్దనుకున్న గొప్ప నిర్ణయమది.
ముంబైలో స్థిర నివాసం ఏర్పరచుకున్న వేదిక బండార్కర్ వాటర్.ఆర్గ్ స్వచ్చంద సంస్థ బాధ్యతల్ని భుజాన వేసుకుని ఇంటింటికీ నల్లా కనెక్షన్, మరుగుదొడ్లు వసతి కల్పించే బృహత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రపంచ వ్యాప్తంగా మంచినీరు కుళాయిలకు, మరుగుదొడ్ల నిర్మాణానికి ఈ సంస్థ సూక్ష్మ రుణాలిస్తుంది. ఈ సంస్థ రుణాల సాయంతో ఇప్పటి దాకా కోటి ఇరవై లక్షల మంది మహిళల జీవితాల్లో వెలుగులు విరబూశాయి.
మనకు గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సూక్ష్మరుణాలందించే సంస్థలు లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి. అయితే వాటికీ ఈ వాటర్.ఆర్గ్ సంస్థకు చాలా తేడా ఉంది. ఈ సంస్ధ కేవలం మంచినీరు మరుగుదొడ్లు సాయానికే పరిమితమయ్యింది. వీటికే ఎందుకు అంటే.. ఏ పల్లెలో వెళ్ళినా మనకు వెంటనే కనిపించే సమస్యలు ఈ రెండే కాబట్టి అంటారు వేదిక బండార్కర్.
నాకు తెలిసి మంచినీటి కోసం ప్రతి గ్రామీణ మహిళ రోజులో కనీసం అయిదారు గంటలైనా వెచ్చించక తప్పని పరిస్థితి. ఈ సౌకర్యమే సమకూరితే ఆ సమయమంతా మిగిలినట్టేగా! కనీసం స్వయం ఉపాధి పనులకు ఆ సమయాన్ని వినియోగించుకుంటారన్న ఆశ అంతే! అంటున్నారు వేద. అంతేకాదు టాయిలెట్లుంటే అమ్మాయిలు బాగా చదువుకోడానికి అవకాశం లభిస్తుంది. అందుకోసమే నాకు ఈ వాటర్.ఆర్గ్ సంస్థలో క్రియా శీలకంగా పనిచేయాలనిపించిందని అంటున్నారు వేదిక బండార్కర్.
బ్యాంకింగ్ రంగంలో పాతికేళ్ల అనుభవం ఉన్న వేదిక జేపీ మోర్గాన్‌లో వైస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా సేవలందించారు. ఇవేగాకుండా వేరే కంపెనీల్లో స్వతంత్ర డైరెక్టర్‌గా వ్యవహరించిన అనుభవమూ ఉంది. బ్యాంకింగ్ రంగంలో అపారమైన అనుభవమున్నా.. స్వచ్ఛంద సంస్థలను నడిపే అనుభవము లేనందున తను తొలుత ముంబైలోని జైవకీల్ స్వచ్ఛంద సంస్థలో వాలంటీరుగా కొన్నాళ్ళు పనిచేశారు. తన ఫ్రెండ్ నిర్వహిస్తున్న ఓ సంస్థ కోసం బిహార్ ఝార్ఖండ్ రాష్ట్రాల్లో యువతుల మహిళల సాధికారత కోసం శ్రమించారు.
ఆ సమయంలోనే మంచినీరు మరుగుదొడ్ల సమస్యతో మహిళలు సతమతమవడాన్ని గమనించారు. దేశం ప్రగతి పథాన దూసుకుపోతోందని మనం ఎంతగా గొప్పలు చెప్పుకున్నా దేశంలో కేవలం 27శాతం మంది మహిళలకు మాత్రమే వ్యక్తిగత మరుగుదొడ్లు వినియోగంలోకి వచ్చాయి. ఇప్పటికీ చాలా ఊళ్ళలో సురక్షిత నీరు లభించడం లేదు. ఈ రెండు కఠిన వాస్తవాలే వేదిక బండార్కర్‌ను మరో స్వచ్ఛంద ఉద్యమానికి ఉసిగొల్పాయి.
కర్ణాటకలోని ఓ మారుమూల గ్రామంలో ఉంటున్న రాధిక తన కూతురిని చదువు కోసం వేరే వూరిలో ఉన్న బంధువుల ఇంటికి పంపించింది. ఓసారి పండుగకు రమ్మంటే తాను రానని కూతురు కరాఖండిగా చెప్పింది. ఆశ్చర్యంతో రాధిక అదేంటి నీ ఇంటికి రావని ఎందుకంటున్నావని అడిగితే కూతురు అక్కడ మరుగుదొడ్లు లేవు కాబట్టి అని సమాధానమివ్వడంతో అవాక్కయింది. ఏం చేయాలని ఆలోచిస్తుంటే ఈ వాటర్.ఆర్గ్ విషయం తన దృష్టికి వచ్చింది.
వెంటనే ఆ స్వచ్ఛంద సంస్థను సంప్రదించి రూ.10వేలు సూక్ష్మరుణం తీసుకుని మరుగుదొడ్డి నిర్మించుకుంది. అంతేకాదు నల్లా కనెక్షన్ పెట్టించుకుంది. కూతురు నవ్వుతూ ఇంటికొచ్చింది. రాధిక మొహం వేయి మతాబుల్లా వెలిగిపోయింది. వేదిక బండార్కర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నేను బ్యాంకర్‌గా ఎన్నో కోట్ల రుణాలిచ్చినప్పుడు కలగని ఆనందం రాధికకు రూ.10వేలు ఇచ్చినప్పుడు కలిగింది.’ అంటూ ఆనందంగా అన్నారు. పెద్ద పెద్ద కొలువులు వదలుకుని దేశ మహిళల కోసం నిరంతరం శ్రమిస్తున్న వేదిక బండార్కర్ జీవితం కచ్చితంగా ఎందరికో ఆదర్శం!!