దేన్నీ వేతెత్తి చూపలేను.. మా మిడిల్ బ‌లంగా ఉంది

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  23 Oct 2020 8:39 AM GMT
దేన్నీ వేతెత్తి చూపలేను.. మా మిడిల్ బ‌లంగా ఉంది

టోర్నీలో నిల‌వాలంటే త‌ప్ప‌క గెల‌వాల్సిన మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌ర‌బాద్ అద్భుత విజ‌యాన్ని సాధించింది. ఇన్నాళ్లు హైద‌రాబాద్ మిడిల్ ఆర్డ‌ర్ ఉన్న సందేహాల‌ను ప‌టా పంచ‌లు చేస్తూ ఆ జ‌ట్టు ఆట‌గాళ్లు మ‌నీష్ పాండే, విజ‌య్ శంకర్ రాణించి మ్యాచ్‌ను రాజ‌స్థాన్ నుంచి లాక్కున్నారు. దీంతో హైద‌రాబాద్ 8 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. ఈ మ్యాచ్ త‌రువాత ఇరు జ‌ట్ల కెప్టెన్లు ఎలా స్పందించారంటే..?

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టుకూ మిడిల్‌ ఆర్డర్‌ బలం ఉందని అభిమానులకు చూపించడం బాగుందని ఆ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్‌ సంతోషం వ్యక్తం చేశాడు. మనీష్‌ పాండే, విజయ్‌ శంకర్ ఇద్దరూ బాగా ఆడారని ప్రశంసించాడు. 'మేం ప్రారంభించిన విధానం అద్భుతమని అనుకుంటా. పవర్‌ప్లే తర్వాత ఆటను మా చేతుల్లోకి తెచ్చుకోగలిగాం. ఇదొక సంపూర్ణ విజయం. విజయ్‌ శంకర్‌, మనీష్‌ పాండే రాణించడం బాగుంది. వాళ్ల కష్టానికి ప్రతిఫలం దక్కింది. ఐపీఎల్ అంటేనే ప్రపంచ శ్రేణి బౌలర్లతో తలపడే అవకాశం ఉంటుంది. అయితే బంతి స్వింగ్‌ అయ్యే అవకాశమూ ఉంది. దాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒక బౌలర్‌ 150 కిమీ వేగంతో బంతులేస్తుంటే ఏం చేయలేం. వీలైతే ఎదురుదాడి చేయాలి. నా విషయంలో మాత్రం ఔటయ్యా . టీమ్‌కు జేసన్‌ హోల్డర్‌ అదనపు బలం. అతడు అంతర్జాతీయ స్థాయిలో ఎంతో అనుభవం కలిగిన ఆటగాడు. జట్టుకు అతడో ఆల్‌రౌండ్‌ ప్యాకేజీలా ఉంటాడు. గత మ్యాచ్‌ల్లో మేము త్వరగా వికెట్లు కోల్పోలేదు. దాంతో మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌కు సరైన అవకాశాలు రాలేదు. హైదరాబాద్‌ జట్టుకూ మిడిల్‌ ఆర్డర్‌ బలం ఉందని అభిమానులకు చూపించడం బాగుందని' వార్న‌ర్ చెప్పాడు.

ఓట‌మి అనంత‌రం స్టీవ్ స్మిత్ మాట్లాడుతూ.. 'మేం అద్భుతంగా ఆరంభించాం. ఆదిలోనే జోఫ్రాఆర్చ‌ర్ రెండు పెద్ద వికెట్ల‌ను తీశాడు. కానీ దాన్ని కొన‌సాగించ‌లేక‌పోయాం. విజ‌య్ తెలివిగా ఆడితే.. మ‌నీష్ అద్భుతంగా ఆట‌ను ముందుకు తీసుకెళ్లిపోయాడు. వాళ్లిద్ద‌రూ చాలా బాగా ఆడారు. అయితే వాళ్లిద్ద‌రిని ఔట్‌చేయ‌డానికి మా జ‌ట్టుతో సంప్ర‌దింపులు జ‌రిపా. మ‌ళ్లి ఆర్చ‌ర్‌ను బౌలింగ్‌కు దింపాల‌ని అనుకున్నా కానీ అలా చేయ‌లేదు. మ్యాచ్ జ‌రిగే కొద్ది వికెట్ మారిపోయింది. కానీ తొలి ఇన్నింగ్స్‌లో నెమ్మ‌దిగా ఉంది. దాంతో మంచి ఆరంభానికి కుద‌ర‌లేదు. మేం ఇంకొన్ని ప‌రుగులు చేయాల్సింది. అయితే.. ఈ ఓట‌మికి కార‌ణంపై దేన్నీ వేలెత్తి చూప‌లేను. ఇక్క‌డ చాలా మంది అత్యుత్త‌మ ఆట‌గాళ్ల‌తో పాటు మంచి జ‌ట్లు ఉన్నాయి. మేం వ‌రుస‌గా విజ‌యాలు సాధించ‌లేక‌పోయాం. ఇక‌పై అన్ని మ్యాచ్‌లు గెల‌వాల్సీ ఉంది. ఫ్లే ఆప్స్ రేసులో నిల‌వాలంటే.. పాయింట్ల ప‌ట్టిక ఎలా ఉండ‌బోదో తెలీదు. మా చేతుత్లో గెల‌వ‌డం ఒక్క‌టే ఉంది.' అని స్మిత్ అన్నాడు.

దుబాయ్‌ వేదికగా గురువారం రాత్రి టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌.. 20 ఓవర్లలో 6 వికెట్లకు 154 పరుగులు చేసింది. సంజూ శాంసన్ ‌(36; 26 బంతుల్లో 3పోర్లు, 1సిక్స‌ర్‌) టాప్‌ స్కోరర్‌. అనంతరం ఛేదనకు దిగిన సన్‌రైజర్స్‌ 18.1 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది. మనీష్‌ పాండే (83*; 47 బంతుల్లో 4పోర్లు, 8సిక్స‌ర్లు), విజయ్‌ శంకర్ ‌(52*; 51బంతుల్లో 6పోర్లు) చివ‌రి వ‌ర‌కు క్రీజులో ఉండి విజయాన్ని అందించారు.

Next Story