పాండే మెరుపులు.. గెలిచిన హైద‌రాబాద్‌

By సుభాష్  Published on  23 Oct 2020 5:33 AM GMT
పాండే మెరుపులు.. గెలిచిన హైద‌రాబాద్‌

త‌ప్ప‌క గెల‌వాల్సిన మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ విజ‌యం సాధించింది. ఆ జ‌ట్టు విధ్వంస‌కర ఆట‌గాళ్లు డేవిడ్ వార్న‌ర్, జానీ బెయిర్ స్టో ఇద్ద‌రూ విఫ‌ల‌మైనా కూడా సన్‌రైజ‌ర్స్ 155 ప‌రుగుల ల‌క్ష్యా న్ని అల‌వోక‌గా చేదించింది. దీంతో లీగ్‌లో నాలుగో విజ‌యం సాధించి ఫ్లే ఆఫ్స్ ఆశ‌ల‌ను స‌జీవంగా ఉంచుకుంది. ఏడు ఓట‌ముల‌తో రాజ‌స్థాన్ ఫ్లే ఆఫ్స్ ఆశ‌ల‌ను సంక్లిష్టం చేసుకుంది.

టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్‌ రాయల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 154 పరుగులు చేసింది. రెండు ఫోర్లు, ఓ సిక్స్‌ కొట్టిన ఓపెనర్‌ రాబిన్‌ ఉతప్ప (19) రనౌటయ్యాడు. మరో ఓపెనర్‌ స్టోక్స్‌ (32 బంతుల్లో 30; 2 ఫోర్లు) చేసిన పరుగుల కంటే ఆడిన బంతులే ఎక్కువ. ఇతను, సంజూ సామ్సన్‌(26 బంతుల్లో 36; 3 ఫోర్లు, 1 సిక్స్‌) చాలా సేపే క్రీజులో ఉన్నా.. అప్పటికీ చేతిలో 9 వికెట్లున్నా పెద్దగా బ్యాట్‌కు పనిచెప్పలేదు. ఇక బ్యాట్ ఝుళిపిస్తారు అన్న ద‌శ‌లో ఈ ఇద్ద‌‌‌రూ కూడా ఔటైయ్యారు. బ‌ట్ల‌ర్‌(9), స్మిత్‌(19), ప‌రాగ్‌(20) లు కూడా ఎక్కువ సేపు నిల‌వ‌లేదు. చివ‌ర్లో ఆర్చ‌ర్ (16 నాటౌట్‌) ధాటిగా ఆడ‌డంతో రాజ‌స్థాన్ స్కోర్ 150 ప‌రుగులైనా ధాటింది. హైద‌రాబాద్ బౌల‌ర్ల‌లో హోల్డర్‌ 3 వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. ర‌షీద్‌ఖాన్‌, విజ‌య్ శంక‌ర్ చెరో వికెట్ ప‌డ‌గొట్టారు.

ల‌క్ష్యం చిన్న‌దే అయినా 16 ప‌రుగ‌ల‌కే ఓపెన‌ర్లు వార్న‌ర్‌(4), బెయిర్ స్టో(10) పెవిలియ‌న్ చేర‌డంతో హైద‌రాబాద్ ఒత్తిడిలో ప‌డింది. మనీశ్‌ పాండే (47 బంతుల్లో 83 నాటౌట్‌; 4 ఫోర్లు, 8 సిక్స్‌లు), విజయ్‌ శంకర్‌ (51 బంతుల్లో 52 నాటౌట్‌; 6 ఫోర్లు) ఇద్ద‌రూ హైద‌రాబాద్‌ను ఆదుకున్నారు. వీరిద్దరు మూడో వికెట్‌కు 93 బంతుల్లోనే అభేద్యంగా 140 పరుగులు జత చేశారు. దీంతో స‌న్ రైజ‌ర్స్ మ‌రో వికెట్ కోల్పోకుండానే 18.1 ఓవర్లలోనే ల‌క్ష్యాన్ని చేదించింది.

Next Story