వరంగల్: జిల్లాలోని నెక్కొండ మండలం ముదిగొండ గ్రామంలో మంగళవారం కావటి మణిదీప్ అనే పదేళ్ల బాలుడు.. గ్రామీణ వైద్యుడి(ఆర్‌ఎంపీ) దగ్గర చికిత్స పొందుతూ మృతి చెందాడు. సోమవారం మణిదీప్ అస్వస్థతకు గురికావడంతో తల్లిదండ్రులు కోటేశ్వర్, సరిత గ్రామంలోని ఆర్‌ఎంపీ అశోక్ వద్దకు తీసుకెళ్లారు. చికిత్సలో భాగంగా అశోక్ ఇంజక్షన్ వేశారు. కొంత సమయం తర్వాత బాలుడి ఆరోగ్య పరిస్థితి విషమించింది. తల్లిదండ్రులు అతడిని వరంగల్‌లోని మహాత్మాగాంధీ మెమోరియల్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.
అశోక్ నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ చనిపోయాడని ఆరోపిస్తూ బాలుడి తల్లిదండ్రులు, బంధువులు అశోక్ ఇంటి ముందు బైఠాయించారు. మణిదీప్ హసన్‌పర్తిలోని జ్యోతిబా ఫూలే గురుకుల పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నాడు. ఈ ఘటన గురించి తెలుసుకున్న తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఈ ఘటనపై స్వయం గా విచారణ చేపట్టింది. దీనిపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని మండలి ఛైర్మన్ డాక్టర్ మహేష్ యాంటీ క్వాకరీ బృందాన్ని ఆదేశించారు.