తెలంగాణలోని వరంగల్ జిల్లాలో రైల్వే ట్రాక్ సమీపంలోని గొయ్యిలో చిక్కుకున్న గుర్తుతెలియని వ్యక్తిని పోలీసులు మంగళవారం త్వరితగతిన రక్షించారు. అటుగా వెళ్లిన స్థానికులకు గొయ్యిలో వ్యక్తి కనిపించాడు. దీంతో వెంటనే స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. ఆ వ్యక్తి రెండు రోజుల క్రితం గొయ్యిలో పడిపోయినట్లు సమాచారం.
సమాచారం అందుకున్న ఆ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ మహ్మద్ హఫీజ్ పాషా వెంటనే మట్టెవాడ ఎస్‌హెచ్‌వో గోపికి సమాచారం అందించాడు. పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సకాలంలో సహాయాన్ని అందించి వ్యక్తి ప్రాణాలను కాపాడారు. సంఘటనా స్థలంలో ఉన్న ప్రజలు పోలీసుల పనితీరుని ప్రశంసించారు. ఆ వ్యక్తి గోతిలో ఎలా పడ్డాడనేది తెలియాల్సి ఉంది.