ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యాటక ప్రియులకు భారతీయ రైల్వే శుభవార్త చెప్పింది. కాజీపేట రైల్వే స్టేషన్ నుండి గోవాకు రైలు సౌకర్యం కల్పించింది. డిసెంబర్, జనవరి నెలల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి పర్యాటక ప్రియులు ఎక్కువగా గోవా వెళ్లేందుకు చాలా ఆసక్తి చూపిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే వారానికి ఒక రోజు కాజీపేట రైల్వే స్టేషన్ మీదుగా 17322/21 నంబర్ గల వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ను నడుపుతోంది రైల్వేశాఖ. ఇప్పటికే ఈ రైలును రెండు వారాలుగా ప్రయోగాత్మకంగా నడిపారు. ఇక ఈ నెల 23వ తేదీ నుండి రెగ్యులర్ రైలుగా మార్చనున్నట్లు తెలిపారు.
గోవాకు వెళ్లే రైలు జార్ఘండ్‌లోని జసిదిహా నుండి వాస్కోడగామ రైల్వే స్టేషన్‌కు వెళ్తుంది. మధ్యలో కాజీపేటలోని ప్రతి మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు ఆగుతుంది. ఆ తర్వాత బుధవారం మధ్యాహ్నం 2.40 గంటలకు చేరుకుంటుంది. తిరిగి శుక్రవారం నాడు వాస్కోడగామ నుండి ఉదయం 5.15 గంటలకు బయల్దేరి ఆ తర్వాత రోజు ఉదయం 1.28 గంటలకు కాజీపేటకు వస్తుంది. ఈ రైలు మంచిర్యాల రైల్వే స్టేషన్‌లో కూడా ఆగనుంది. ప్రతి మంగళవారం మధ్యాహ్నం 2.35 గంటలకు మంచిర్యాలలో ఆగుతుంది. ఆ తర్వాత గోవా నుండి తిరుగు ప్రయాణంలో ఉదయం 2.45 గంటలకు మంచిర్యాలకు చేరకుంటుంది. రెండు, మూడో తరగతి ఎసీ బెర్త్‌లు, స్లీపర్ కాస్ సీట్లు అందుబాటులో ఉంటాయి.