తెలంగాణ కుంభమేళా మేడారం జాతర ప్రారంభం.. పోటెత్తిన భక్తులు
Telangana's Medaram Jatara begins.ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ జాతర, దక్షిణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం
By తోట వంశీ కుమార్ Published on 16 Feb 2022 6:28 AM GMTఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ జాతర, దక్షిణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర నేటి నుంచి శనివారం వరకు( ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు) అంగరంగ వైభవంగా జరగనుంది. జాతరకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఇప్పటికే మేడారం చుట్టుపక్కల జన సంద్రమైంది. వన దేవతలకు మొక్కులు చెల్లించేందుకు, నిలువెత్తు బంగారం సమర్పించుకునేందుకు, చీరె, సారెలు అమ్మలకు ఇచ్చేందుకు దారులన్నీ మేడారం వైపే అన్నట్లుగా పలు రాష్ట్రాల నుంచి నుంచి భక్తులు తరలివస్తున్నారు.
జాతరలో ఇవాళ తొలిఘట్టం ఆవిష్కృతం కానుంది. నేడు సారలమ్మ రేపు సమ్మక్క తల్లులు గద్దెలపై కొలువుదీరనున్నారు . ముఖ్యమంత్రి కేసీఆర్ 18న వనదేవతలను దర్శిస్తారు. జాతరకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేసింది. దాదాపు నలభై వేల మంది సిబ్బంది ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. దాదాపు కోటిన్నర మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకుంటారని అంచనా. జాతర తొలి రోజున కన్నెపల్లి నుంచి సారలమ్మను గద్దెకు తీసుకువస్తారు.
రెండోరోజు చిలుకుల గుట్టలో కుంకుమ భరిణె రూపంలో ఉన్న సమ్మక్క తల్లిని తీసుకొచ్చి మేడారంలోని గద్దె మీద ప్రతిష్టిస్తారు. అమ్మవారిని తీసుకొచ్చే దారి పొడవునా భక్తులు ముగ్గులు వేస్తారు. ఆ సమయంలో భక్తులు డప్పు చప్పుళ్లతో పూనకాలతో ఊగిపోతారు. మేడారం మహా జాతరలో ఇదే ప్రధాన ఘట్టం. సమ్మక్కను తీసుకొస్తున్న పూజారులను తాకేందుకు.. అమ్మకు స్వాగతం పలికేందుకు దారిపొడవునా.. ఇసుకేస్తే రాలనంతగా భక్తులుంటారు. మూడో రోజు అమ్మవార్లు ఇద్దరు గద్దెలపై కొలువుదీరి భక్తులను దర్శనమిస్తారు. అమ్మవార్లకు పసుపు, కుంకుమలు , చీర , సారె, నూనె కలిపిన ఒడిబియ్యం, బంగారంగా పిలుచుకొనే బెల్లాన్ని సమర్పిస్తారు. నాలుగోరోజు సాయంత్రం ఆవాహన పలికి దేవతలందరినీ తిరిగి అడవికి తీసుకెళ్తారు పూజారులు. వేడుక మొత్తం వంశపారంపర్యంగా వస్తున్న గిరిజన పూజారులే చేయడం ఆనవాయితీ.
టీఎస్ఆర్టీసీ జాతర కోసం 3,845 బస్సులను నడుపుతోంది. ప్రైవేటు వాహనాల పార్కింగ్ కోసం 1,100 ఎకరాలను కేటాయించారు. 32 ఎకరాల్లో బస్ స్టేషన్ ఏర్పాటు చేశారు. జంపన్న వాగు వరకు 25 మినీ బస్సులను నిరంతరం నడిచే విధంగా ఉచిత బస్సు సౌకర్యం కల్పించారు. ఈ సారి భక్తుల విడిది కోసం శాశ్వత ప్రాతిపదికన 5 భారీ షెడ్లను నిర్మించారు. కరోనాను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం మాస్క్‌లతో పాటు శానిటైజర్లను సైతం పంపిణీ చేస్తోంది. మేడారంలో ఆస్పత్రి ఏర్పాటుతో పాటు మరో 35 ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేశారు. ఆహారం, నీటి నాణ్యతను ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు ప్రభుత్వం ఆహారభద్రత అధికారును నియమించింది.