రామప్ప ఆలయ పరిసర భూములపై "రియల్ పడగ"
Real Estate Boom At Ramappa Temple Area. ఇటీవల యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ 44వ సమావేశంలో రామప్ప గుడికి ప్రపంచ
By అంజి
ఇటీవల యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ 44వ సమావేశంలో రామప్ప గుడికి ప్రపంచ వారసత్వ కట్టడ హోదా కల్పించింది. ఈ నేపథ్యంలో రామప్ప ఆలయం నుండి 10 నుంచి 20 కిలోమీటర్ల దూరం పరిధిలో గల భూములు ధరలు విపరీతంగా పెరిగాయి. ఎంత ధరైనా సరే చెల్లించి వ్యవసాయ భూములను కొనేందుకు రియల్టర్లు ముందుకు వస్తున్నారు. భూములను కొనుగోలు చేసి వెంచర్లను ఏర్పాటు చేసేందుకు ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలు తమ ఏజెంట్లను రంగంలోకి దించాయి. రానున్న రోజుల్లో ఈ భూముల విలువ మరింత పెరిగే అవకాశం ఉండడంతో.. గజాల చొప్పున భూమిని విక్రయించేందుకు రియల్ ఏస్టేట్ వ్యాపారులు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ముందుగానే భూమిని కొని రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు రియల్టర్లు క్యూ కడుతున్నారు.
యునెస్కో గుర్తింపు రాకముందు రామప్ప పరిసర ప్రాంత వ్యవసాయ భూములు 15 నుంచి 20 లక్షల రూపాయలు ఉండగా ప్రస్తుతం ఆ భూముల ధరలు రూ.40 లక్షలకుపైగా పలుకుతున్నాయి. ఇక రోడ్డు పక్కన గల భూములు మాత్రం ఏకంగా కోట్ల రూపాయలు పలుకుతున్నాయి. రానున్న రోజుల్లో రామప్పకు పర్యాటకుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. పర్యాటకుల అవసరాలకు తగ్గట్లుగా మౌళిక సౌకర్యాలు కల్పించేందుకు పెద్ద పెద్ద హోటళ్లు, షాపులు నిర్మించేందుకు అవకాశాలుండడంతో ధరలు అమాంతం పెరిగినట్లు స్థానికులు చెబుతున్నారు.
ఇదిలా ఉంటే ఆలయం చుట్టు ప్రక్కల నిర్ణయించిన దూరం వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టొదని హైకోర్టు పేర్కొంది. ఆలయ శిల్పకళకు ఎలాంటి హానిజరగకుండా ఆలయం చుట్టూ నిర్ణీత దూరం వరకు బఫర్ జోన్ ప్రాంతంగా ప్రకటించాలని ఆదేశాలిచ్చింది. విదేశీ పర్యాటకులు స్టే చేసేందుకు వీలుగా నిర్మించే కట్టడాలు ఆలయానికి వీలైనంత ఎక్కువ దూరంలో ఉండాలని తేల్చిచెప్పింది. రామప్ప ఆలయ పరిసర ప్రాంతాలు ఎట్టి పరిస్థితుల్లోనూ కాంక్రిట్ జంగిల్‌గా మారకుండా చూడాలని తెలిపింది. రామప్ప ఆలయానికి శాశ్వత యునెస్కో గుర్తింపు లభించేందుకు సకాలంలో పనులను పూర్తి చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.