Warangal: కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థినీలను కొరికిన ఎలుకలు

వరంగల్‌లోని కాకతీయ యూనివర్శిటీలోని ఉమెన్స్ హాస్టల్‌కు చెందిన ఇద్దరు విద్యార్థినులను ఎలుకలు కొరికిన ఘటన వెలుగు చూసింది.

By అంజి  Published on  8 March 2023 4:24 PM IST
Rats ,  Kakatiya University ,Warangal

Warangal: కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థినీలను కొరికిన ఎలుకలు

గత రెండు వారాలుగా జంతువుల దాడి ఘటనలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో.. వరంగల్‌లోని కాకతీయ యూనివర్శిటీ బైపాస్ రోడ్డులోని ఉమెన్స్ హాస్టల్‌కు చెందిన ఇద్దరు విద్యార్థినులను ఎలుకలు కొరికిన ఘటన వెలుగు చూసింది. మంగళవారం నిద్రిస్తున్న సమయంలో ఎలుకలు తమ చేతులు, కాళ్లను కొరికాయి. పద్మాక్షి హాస్టల్ 'డీ' బ్లాక్ లోని రూం నంబరు-1లో ఇద్దరు విద్యార్థినులకు తీవ్ర గాయాలు అయ్యాయి. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. దీంతో తోటి సహచరులు చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారని విద్యార్థులు తెలిపారు.

ఘటన జరిగిన హాస్టల్‌లో పారిశుద్ధ్యం లోపించిందని, అధికారులు హాస్టల్‌ను డంప్‌యార్డ్‌గా ఉపయోగిస్తున్నారని పనికి రాని వస్తువులన్నీ నిల్వ ఉంచారని.. ఫలితంగానే ఎలుకలు స్వైర విహారం చేస్తున్నాయని విద్యార్ధినులు చెప్పారు. ఈ కారణంగానే హాస్టల్‌లో ఎలుకల సంఖ్య పెరిగిపోయిందన్నారు. దీనికి తోడు ఎలుకలు నోట్‌బుక్‌లు, బ్యాగులు, బట్టలు తినేస్తున్నాయని విద్యార్థులు ఫిర్యాదు చేశారు. గతంలో హాస్టల్‌ వార్డెన్‌కు ఫిర్యాదు చేశామని, కానీ వార్డెన్‌ పట్టించుకోలేదని విద్యార్థులు వాపోయారు.

ఇక గతంలో వరంగల్‌లోని మహాత్మాగాంధీ మెమోరియల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో తీవ్రమైన ఎలుకల కాటుతో రక్తస్రావంతో రోగి మరణించిన విషయం తెలిసిందే.

Next Story