ఓరుగ‌ల్లులో టీఆర్ఎస్ ప్ర‌భుత్వంపై రాహుల్ విమ‌ర్శ‌ల 'హోరు'

Rahul Gandhi Fire On TRS Govt. ఒక్క‌రి కోస‌మే తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డ‌లేద‌ని.. ఏ ఒక్క‌రి వ‌ల్ల‌నో రాష్ట్రం రాలేద‌ని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అన్నారు

By Medi Samrat  Published on  6 May 2022 2:47 PM GMT
ఓరుగ‌ల్లులో టీఆర్ఎస్ ప్ర‌భుత్వంపై రాహుల్ విమ‌ర్శ‌ల హోరు

ఒక్క‌రి కోస‌మే తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డ‌లేద‌ని.. ఏ ఒక్క‌రి వ‌ల్ల‌నో రాష్ట్రం రాలేద‌ని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అన్నారు. వ‌రంగ‌ల్ లో జ‌రుగుతున్న రైతు సంఘ‌ర్ష‌ణ స‌భ‌కు హాజ‌రైన ఆయ‌న ముందుగా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను వేదిక మీద ప‌రామర్శించారు. అనంత‌రం మాట్లాడుతూ.. తెలంగాణ వ‌ల్ల ఒకే కుటుంబం బాగుప‌డింద‌ని ఆరోపించారు. వేదిక మీద భ‌ర్త‌ల‌ను పోగొట్టుకున్న మ‌హిళ‌లు ఉన్నారు.. వీరి వేద‌న‌కు కార‌ణం ఎవ‌రని రాహుల్ ప్ర‌శ్నించారు. ఇటువంటి బాధిత రైతులు రాష్ట్ర‌మంతా ఉన్నార‌ని అన్నారు. తెలంగాణ క‌ల‌ను సాక‌రం చేసుకోవ‌డానికి మీరు ర‌క్తాన్ని, క‌న్నీళ్ల‌ను చిందించార‌ని గుర్తుచేశారు. కాంగ్రెస్ మీ క‌ల‌ను నెర‌వేర్చింద‌న్నారు. రాష్ట్రం ఏర్ప‌డ్డాక స‌బ్బండ వ‌ర్గాల‌కు మేలు చేకూర్చే ప్ర‌భుత్వం ఏర్ప‌డుతుంద‌ని భావించామ‌ని.. కానీ అలా జ‌ర‌గ‌లేద‌ని అన్నారు. ఇక్క‌డ ముఖ్యమంత్రి రాజులా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని.. రాష్ట్రంలో రాజ‌రికం న‌డుస్తోంద‌ని.. తెలంగాణ‌లో పేరుకే ముఖ్య‌మంత్రి అని విమ‌ర్శించారు. ఇక్క‌డ ప్ర‌జా ప్ర‌భుత్వం ఏర్ప‌డ‌లేద‌ని వ్యాఖ్యానించారు.

తెలంగాణ రైతులు పండించిన పంట‌కు గిట్టుబాట ధ‌ర అడుగుతున్నారు.. రుణ మాఫీ చేయ‌మ‌ని అడుగుతున్నారు.. అయినా ముఖ్య‌మంత్రి రైతుల బాధ విన‌డం లేద‌ని విమ‌ర్శించారు. ఛ‌త్తీస్ గ‌డ్‌లో ఉన్న కాంగ్రెస్ ప్ర‌భుత్వం రైతుల హామీల‌ను నెర‌వేర్చింద‌ని తెలిపారు. తెలంగాణ రైతులు ఆందోళ‌న చెంద‌వ‌ద్ద‌ని అన్నారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం రాగానే ఒకేసారి రెండు ల‌క్ష‌ల రూపాయ‌ల రైతు రుణ‌మాఫీ చేస్తామ‌ని హామీ ఇచ్చారు. ఇలాగే ప‌దిహేను వేల రూపాయ‌ల పంట పెట్టుబ‌డి సాయం నేరుగా అకౌంట్‌కు బ‌దిలీ చేస్తామ‌ని అన్నారు. ఇది వ‌రంగ‌ల్ డిక్ల‌రేష‌న్ అని.. ఇది చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుందని రాహుల్ గాంధీ అన్నారు.

టీఆర్ఎస్‌తో పొత్తు గురించి మాట్లాడే ఏ కాంగ్రెస్ నేత‌నైనా పార్టీ నుంచి బ‌హిష్క‌రిస్తామ‌ని వార్నింగ్ ఇచ్చారు. టీఆర్ఎస్ తో పొత్తు కోరుకునే వ్య‌క్తులు ఆ పార్టీలోకి వెళ్లొచ్చ‌ని సూచించారు. తెలంగాణ‌ను వేల కోట్లు దోచుకున్న వ్య‌క్తుల‌తో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకోద‌ని.. వ‌చ్చే ఎన్నిక‌ల‌లో టీఆర్ఎస్‌ను ఓడించి తీరుతామ‌ని అన్నారు. రైతుల ప‌క్షాన పోరాడిన వారికే కాంగ్రెస్ టిక్కెట్లు ద‌క్క‌తాయ‌ని నేత‌ల‌కు అల్టిమేటం జారీచేశారు. మీరు ఎంత పెద్ద నేతైనా ప్ర‌జ‌ల ప‌క్షాన పోరాడ‌క పోతే టిక్కెట్టు ద‌క్క‌ద‌ని అన్నారు.

అంత‌కుముందు తెలంగాణలో రెండు రోజుల పాటు పర్యటించనున్న జాతీయ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి శుక్రవారం రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, ఇతర కాంగ్రెస్ సీనియర్ నేతలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాహుల్‌ గాంధీ వీఐపీ లాంజ్‌లో రేవంత్‌రెడ్డి, మహేశ్వర్‌రెడ్డి, అశోక్‌కుమార్‌ తదితర సీనియర్‌ నేతలతో సమావేశమై తెలంగాణ పరిస్థితులపై చర్చించారు.Next Story