హన్మకొండలో మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి అరెస్ట్

Police arrest former IAS officer Akunuri Murali in Hanamkonda. హన్మకొండ: మాజీ ఐఏఎస్‌ అధికారి, సోషల్‌ డెమోక్రటిక్‌ ఫోరం (ఎస్‌డీఎఫ్‌) కన్వీనర్‌ ఆకునూరి మురళి,

By అంజి  Published on  31 Jan 2023 6:52 AM GMT
హన్మకొండలో మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి అరెస్ట్

హన్మకొండ: మాజీ ఐఏఎస్‌ అధికారి, సోషల్‌ డెమోక్రటిక్‌ ఫోరం (ఎస్‌డీఎఫ్‌) కన్వీనర్‌ ఆకునూరి మురళి, ఫోరం కో-కన్వీనర్‌ డాక్టర్‌ పృధ్వీరాజ్‌లను పోలీసులు మంగళవారం తెల్లవారుజామున అరెస్ట్‌ చేశారు. ఎస్‌డీఎఫ్‌ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో పంచుకున్న వీడియో ప్రకారం.. వారు హన్మకొండలోని అంబేద్కర్ కాలనీలో ఒక గుడిసెలో నిద్రిస్తుండగా, పోలీసులు అర్ధరాత్రి వారిని తీసుకొని సుబేదారి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

అంబేద్కర్ నగర్‌లో నిర్మించిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను ప్రభుత్వమే తక్షణమే కేటాయించాలని డిమాండ్‌ చేస్తూ ఉదయం 7 గంటలకు బాలసముద్రంలోని అంబేద్కర్‌ కాలనీ ప్రజలతో సమావేశం నిర్వహించేందుకు యోచిస్తున్నట్లు ఎస్‌డిఎఫ్‌ తెలిపింది.

''ఐదేళ్ల క్రితం మొత్తం 540 2 బిహెచ్‌కె ఇళ్లు నిర్మించబడ్డాయి. కానీ ఇళ్లు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్న పేదలకు ప్రభుత్వం వాటిని కేటాయించడం లేదు'' అని ఎస్‌డీఎఫ్‌ ఆరోపిస్తూ అరెస్టులను ఖండించింది.

పేదలకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు కేటాయించాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం భూపాలపల్లి పట్టణంలో మురళి, అతని అనుచరులు స్థానిక ప్రజలతో కలిసి నిరసన చేపట్టారు. అతను దాదాపు 200 మందితో కలిసి 2BHK ఇళ్లను సందర్శించి వాటిని ఆక్రమించేందుకు ప్రయత్నించినప్పుడు అరెస్టు చేశారు.

అనంతరం ఇళ్లు కేటాయించాలని డిమాండ్‌ చేస్తూ పోలీస్‌స్టేషన్‌లోనే ధర్నాకు దిగారు. ఘటన గురించి తెలుసుకున్న భూపాలపల్లి కలెక్టర్ భవేష్ మిశ్రా స్థానిక తహశీల్దార్ ఎండీ ఇక్బాల్‌ను మాజీ ఐఏఎస్ అధికారితో మాట్లాడేందుకు పంపారు. 10రోజుల్లో ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తామని అధికారులు హామీ ఇచ్చినా వెంటనే మంజూరుకు చర్యలు తీసుకోవాలని మురళి కోరారు. అయితే ఫిబ్రవరి 4వ తేదీలోగా ఇళ్ల కేటాయింపు జరుగుతుందని కలెక్టర్ హామీ ఇచ్చారు.

దీంతో మురళి తన నిరసనను విరమించి ఫిబ్రవరి 6న భూపాలపల్లిలో మళ్లీ పర్యటించి కేటాయింపు పురోగతిని తెలుసుకుంటానని చెప్పారు. జయశంకర్ భూపాలపల్లి మొదటి జిల్లా కలెక్టర్‌గా 2016 నుంచి 18 వరకు మురళి పనిచేశారు.మొత్తం 500 డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం పూర్తి కాగా, మరో 500 ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయి.

Next Story