రాకేష్ తల్లిదండ్రులను ఓదార్చిన టీఆర్ఎస్ నేతలు
Hundreds gather at MGM Hospital to pay tributes to Damera Rakesh. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో శుక్రవారం పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన దామెర రాకేష్
By Medi Samrat Published on 18 Jun 2022 1:00 PM ISTసికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో శుక్రవారం పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన దామెర రాకేష్ మృతి పట్ల శనివారం ఎంజీఎం ఆస్పత్రి వద్దకు టీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు సహా వందలాది మంది తరలివచ్చి సంతాపం తెలిపారు. సాయుధ దళాలలో చేరి దేశానికి సేవ చేయాలని కలలు కన్న యువకుడు.. మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల మరణించాడని నల్ల రిబ్బన్లు, కండువాలు ధరించి నినాదాలు చేశారు.
మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌భాస్కర్, నన్నపునేని నరేందర్‌తో పాటు పలువురు నేతలు ఎంజీఎం ఆస్పత్రిలోని మార్చురీని సందర్శించి రాకేష్ తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులను ఓదార్చారు. రాకేష్ తల్లిదండ్రులు కుమార స్వామి, పూలమ్మలు ఇంకా తమ కుమారుడు ప్రాణాలను కోల్పోయిన షాక్‌లో ఉన్నారు.
తమ కొడుకు దేశానికి సేవ చేయాలని, దేశ రక్షణ కోసం ప్రాణత్యాగం చేయాలని భావించామని.. పోలీసుల కాల్పుల్లో అతడు చనిపోయాడని విలపించారు. "అభ్యర్థులు ఎవరూ సంతోషంగా లేనందున.. యువకుల జీవితాలను కాపాడటానికి అగ్నిపథ్ పథకాన్ని ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను" అని రాకేష్ తండ్రి కుమారస్వామి అన్నారు. కొడుకు మృతితో తల్లి పూలమ్మ కన్నీరుమున్నీరుగా విలపిస్తూ ఉంది.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ.. అగ్నిపథ్ పథకంపై ప్రధాని నరేంద్ర మోదీ జాతికి, రాకేష్ తల్లిదండ్రులకు క్షమాపణలు చెప్పాలన్నారు. ఇదిలావుంటే రాకేష్ మృతదేహాన్ని మినీ ట్రక్కులో ఊరేగింపుగా దబీరాపేట గ్రామానికి తరలించి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఇదిలా ఉండగా.. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ విషాద ఘటనపై టీఆర్‌ఎస్ పార్టీ ఇచ్చిన బంద్‌కు జిల్లాలో ముఖ్యంగా నర్సంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో మంచి స్పందన లభించింది. వరంగల్, నర్సంపేటలో అన్ని విద్యాసంస్థలు, వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి.