తెలంగాణ బీజేపీలో విషాదం.. మాజీ ఎంపీ జంగారెడ్డి క‌న్నుమూత‌

Former BJP leader and former MP Jangareddy passed away.భార‌తీయ జ‌న‌తా పార్టీలో తీవ్ర విషాదం నెల‌కొంది. బీజేపీ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 Feb 2022 9:59 AM IST
తెలంగాణ బీజేపీలో విషాదం.. మాజీ ఎంపీ జంగారెడ్డి క‌న్నుమూత‌

భార‌తీయ జ‌న‌తా పార్టీలో తీవ్ర విషాదం నెల‌కొంది. బీజేపీ సీనియ‌ర్ నేత‌, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే చందుప‌ట్ల జంగారెడ్డి క‌న్నుమూశారు. గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న హైద‌రాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. శనివారం ఆయ‌న ప‌రిస్థితి విష‌మించ‌డంతో తుదిశ్వాస విడిచారు. ఆయ‌న వ‌య‌స్సు 87 సంవ‌త్స‌రాలు. ఆయ‌న‌ ఆకస్మిక మ‌ర‌ణం ప‌ట్ల‌ పలువురు నాయకులు సంతాపం తెలిపారు. ఆయ‌న పార్థివ దేహాన్ని బీజేపీ రాష్ట్ర కార్యాల‌యానికి త‌ర‌లించారు.

వ‌రంగ‌ల్ జిల్లా ప‌ర‌కాల‌లో 1935లో జంగారెడ్డి జ‌న్మించారు. ప్ర‌స్తుతం ఆయ‌న హ‌న్మ‌కొండ‌లో నివాసం ఉంటున్నారు. 1953లో సి.సుధేష్ణను వివాహం చేసుకున్నారు. వీరికి ఓ కుమారుడు, ఇద్ద‌రు కుమారైలు సంతానం. జంగారెడ్డి రాజకీయాల్లోకి రాకముందు కొద్ది రోజులు ప్రభుత్వ పాఠశాలలో హయ్యర్ సెకండరీ టీచర్ గా పనిచేశారు. 1984లో బీజేపీ నుంచి గెలిచిన ఇద్ద‌రు ఎంపీల్లో జంగారెడ్డి ఒక‌రు. అప్ప‌ట్లో హ‌నుమ‌కొండ పార్ల‌మెంట్ నుంచి ఆయ‌న పోటీ చేశారు. ఆ ఎన్నిక‌ల్లో మాజీ ప్ర‌ధాని పీవీ న‌ర‌సింహారావుపై 54 వేలపై చిలుకు మెజారిటీతో ఆయ‌న గెలుపొందారు.

ఇక‌ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి లోక్‌సభలో బీజేపీకి ప్రాతినిధ్యం వహించిన ఏకైక వ్యక్తి చందుపట్ల జంగారెడ్డి. ఈ ఎన్నికల్లో వాజ్‌పేయ్, అద్వానీ వంటి బీజేపీ అగ్రనాయకులందరూ పరాజయం పాలయినా జంగారెడ్డి విజయం సాధించారు. జంగారెడ్డి 1967-72 (పర్కల్ నుండి జనసంఘ్ సభ్యునిగా), 1978-83 (శ్యాంపేట నుండి జనతా పార్టీ సభ్యునిగా), 1983-84 (బిజెపి సభ్యునిగా శ్యాంపేట నుండి) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యారు.

జంగారెడ్డి మృతిప‌ట్ల కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి, బండి సంజ‌య్‌, ఎమ్మెల్యే ఈట‌ల రాజేంద‌ర్ సంతాపం తెలిపారు. ఆయ‌న మ‌ర‌ణం బీజేపీకి తీరని లోట‌న్నారు. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు.

Next Story