వరంగల్‌ ఎంజీఎం ఘటన : మంత్రి ఎర్రబెల్లి సమీక్షా సమావేశం

Errabelli Dayakar Rao chairs review meeting with officials. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అధ్యక్షతన శుక్రవారం ఎంజీఎంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.

By Medi Samrat  Published on  1 April 2022 3:04 PM IST
వరంగల్‌ ఎంజీఎం ఘటన : మంత్రి ఎర్రబెల్లి సమీక్షా సమావేశం

మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అధ్యక్షతన శుక్రవారం ఎంజీఎంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆసుపత్రిలో ఎలుకలు కుట్టిన ఘటనపై మంత్రి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఆయన చర్చించినట్లు తెలుస్తోంది. ఎంజీఎంలో పారిశుధ్య పనులను కూడా దయాకర్‌రావు పరిశీలించారు. బాధితుడు శ్రీనివాస్‌ను కలిసి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నట్లు సమాచారం.

శ్రీనివాస్‌ అనే పేషెంట్‌ ఎలుకల దాడికి బలికావడం దారుణమైన పరిస్థితి నేపథ్యంలో ఎంజీఎంహెచ్‌ సిబ్బంది ప్రస్తుతం ఆస్పత్రిలో పారిశుద్ధ్య పనులకు శ్రీకారం చుట్టారు. ఎలుకలను పట్టుకునేందుకు ఎంజీఎంహెచ్ సిబ్బంది ప్రతి వార్డు, గదిలో ఎలుకల బోన్‌లు ఏర్పాటు చేశారు. దవాఖానలో ఎలుకల బెడద లేకుండా చేసేందుకు క్లీనింగ్ కార్యక్రమం కూడా నిర్వహించాలని ఆసుపత్రి అధికారులు యోచిస్తున్నట్లు సమాచారం. శ్రీనివాస్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని.. తదుపరి చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించనున్నట్లు సమాచారం.

ఉత్తర తెలంగాణకు ఆయువుపట్టుగా చెప్పుకునే ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఎంజీఎం ఆసుప‌త్రిలో దారుణమైన దుస్థితి మరోసారి తేటతెల్లం కావడంతో అధికారులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. ఇదిలావుంటే.. ఊపిరితిత్తులు, కాలేయ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న నగరంలోని భీమారంకు చెందిన 38 ఏళ్ల కడార్ల శ్రీనివాస్‌ను మార్చి 26న ఎంజీఎంలోని ఆర్‌ఐసీయూ వార్డులో చేర్చారు.

వైద్యం కోసం ఆస్ప‌త్రికి వెళ్లిన శ్రీనివాస్‌ కాలు, చేతి వేళ్ల‌ను ఎలుక‌లు కొరికివేశాయి. దీంతో అత‌డికి తీవ్ర ర‌క్త‌స్రావమైంది. డాక్టర్ల నిర్లక్ష్యంపై బంధువులు మండిప‌డ్డారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న పేషంట్ కే ఇలా జ‌రిగితే, మిగ‌తా రోగుల ప‌రిస్థితి ఏంట‌ని ప్ర‌శ్నించారు. విషయం వెలుగులోకి వచ్చిన వెంటనే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు స్పందించారు. ఘటనపై పూర్తి వివరాలు, తక్షణం నివేదిక రూపంలో పంపించాలని, రోగికి నాణ్యమైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనకు బాధ్యులైన ఎంజీఎం సూపరింటెండెంట్ పై బదిలీ వేటు వేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు వైద్యులపై సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. గతంలో సూపరింటెండెంట్ గా ఉన్న చంద్రశేఖర్ కు పూర్తి బాధ్యతలు అప్పగించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.



















Next Story