వరంగల్ నగరంలో విషాద ఘటన చోటు చేసుకుంది. చాక్లెట్ గొంతులో ఇరుక్కొని ఎనిమిదేళ్ల బాలుడు మృతి చెందాడు. నగరంలోని పిన్నవారి వీధిలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. రాజస్థాన్‌కు చెందిన కంగహన్ సింగ్ 20 ఏళ్ల క్రితం వరంగల్‌కు వలస వచ్చాడు. అతడు జేపీఎన్ రోడ్‌లో ఎలక్ట్రికల్ దుకాణాన్ని నడుపుతున్నాడు. అతనికి భార్య గీత, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ లైన్‌లో నివసిస్తున్నాడు. కంగహన్ ఇటీవల వ్యాపార నిమిత్తం ఆస్ట్రేలియా వెళ్లి అక్కడి నుంచి పిల్లల కోసం చాక్లెట్లు తీసుకొచ్చాడు.
కంగహన్ రెండవ కుమారుడు ఎనిమిదేళ్ల సందీప్ స్థానికంగా ఉన్న శారద పబ్లిక్ స్కూల్‌లో సెకండ్ క్లాస్ చదువుతున్నాడు. అతని సోదరుడు, సోదరి కూడా ఈ పాఠశాల విద్యార్థులే. బైక్‌పై స్కూలుకు వెళ్లే ముందు కంగహన్ సింగ్ తల్లి పిల్లలకు చాక్లెట్లు ఇచ్చింది. నోటిలో చాక్లెట్ పెట్టుకుని స్కూల్ మొదటి అంతస్తులోని తరగతి గదిలోకి వెళ్లిన సందీప్ కొద్దిసేపటి తర్వాత స్పృహతప్పి పడిపోయాడు. స్కూల్ యాజమాన్యం సమాచారం ఇవ్వడంతో కంగహన్ సింగ్ వెంటనే వచ్చి అతడిని ఎంజీఎం ఆస్పత్రికి తీసుకెళ్లాడు. సందీప్ గొంతులో చాక్లెట్ ఇరుక్కుపోయిందని, చికిత్స పొందుతూ ఊపిరాడక మృతి చెందినట్లు వైద్యులు గుర్తించారు. శనివారం సాయంత్రం సందీప్ అంత్యక్రియలు జరిగాయి. ఈ ఘటనతో బాలుడి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.