కేసీఆర్ పర్యటన అనూహ్యంగా రద్దు
CM KCR Warangal Visit Cancelled. తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు వరంగల్ జిల్లా పర్యటన అనూహ్యంగా రద్దయింది
By Medi Samrat Published on 9 Nov 2021 5:41 PM ISTతెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు వరంగల్ జిల్లా పర్యటన అనూహ్యంగా రద్దయింది. బుధవారం నాడు ఆయన వరంగల్, హన్మకొండ జిల్లాల్లో పర్యటించాల్సి ఉంది. ఆయన పర్యటనకు సంబంధించి ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పలు అభివృద్ధిపనులకు శ్రీకారం చుట్టాలని సీఎం భావించారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో కోడ్ అమల్లోకి రావడంతో సీఎం పర్యటన రద్దయిందని అధికార వర్గాలు తెలిపాయి. తిరిగి ఎప్పుడు వెళతారనేది త్వరలో వెల్లడిస్తామని సీఎం కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. సీఎం పర్యటన రద్దుతో ప్రభుత్వ అభివృద్ధి పనులు, ప్రారంభోత్సవాలు వాయిదా పడ్డాయి.
తెలుగు రాష్ట్రాల్లో స్థానిక సంస్థల కోటాకు సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఏపీలో 11 ఎమ్మెల్సీ స్ధానాలకు, తెలంగాణలో 12 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలోని నిజామాబాద్, ఖమ్మం, మెదక్, నల్గొండ, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఒక్కో స్థానం చొప్పున... రంగారెడ్డి, కరీంనగర్, మహబూబ్ నగర్ జిల్లాల్లో రెండు స్థానాల చొప్పున ఖాళీలు ఉన్నాయి. వీటికి ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. దీంతో పాటు ఏపీలో ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు కూడా షెడ్యూల్ విడుదల చేసింది. నవంబర్ 16న ఈ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల అవుతుంది. నవంబర్ 23 నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ. 24వ తేదీన నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు నవంబర్ 26 చివరి తేదీ. డిసెంబర్ 10న పోలింగ్ జరుగుతుంది. డిసెంబర్ 14న ఓట్ల లెక్కింపు జరుగుతుందని ఈసీ ప్రకటించింది.