కేంద్ర మంత్రులు ఇక్కడ తిడతారు.. ఢిల్లీలో అవార్డులిస్తారు : సీఎం కేసీఆర్
CM KCR Speech at Pratima Medical College inaugurate in Warangal.నేడు తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా నిలిచిందని సీఎం
By తోట వంశీ కుమార్ Published on 1 Oct 2022 1:22 PM ISTఅనేక రంగాల్లో నేడు తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా నిలిచిందని సీఎం కేసీఆర్ అన్నారు. వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా ప్రతిమ క్యాన్సర్ ఆస్పత్రిని ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపించిందన్నారు. రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజీని కూడా ఇవ్వలేదన్నారు. వైద్య విద్య కోసం విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్రంలోనే వైద్య విద్యకు సరిపడా సీట్లు ఉన్నాయని కేసీఆర్ తెలిపారు. గత ఏనిమిది ఏళ్లలోనే 12 కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశామని, త్వరలోనే మొత్తం 33 జిల్లాల్లో మెడికల్ కాలేజీలు వస్తాయన్నారు. 2014 వరకు రాష్ట్రంలో 2 వేల 4 వందల మెడికల్ కాలేజీ సీట్లు ఉంటే.. ఇప్పుడు 6 వేల ఏడు వందలకు పెరిగాయన్నారు.
రాజకీయాల కోసమే కేంద్ర మంత్రులు రాష్ట్రానికి వచ్చి తనను తిడుతున్నారని కేసీఆర్ అన్నారు. కేంద్ర మంత్రులు ఇక్కడ విమర్శిస్తున్నారు.. ఢిల్లీలో అవార్డులు ఇస్తున్నారని చెప్పారు. కేంద్రమంత్రులు తిట్టిపోయిన మర్నాడే రాష్ట్రానికి జాతీయ స్థాయిలో అవార్డులు వస్తున్నాయన్నారు. దేశంలో ఏం జరుగుతుందో ప్రజలు గమనించాలన్నారు. ఉద్యమ సమయంలో తాను చెప్పినవన్నీ ఇవాళ సాకారం అయ్యాయన్నారు. తెలంగాణ జీడీపీ ఎక్కువగా ఉంది. పరిశుభ్రత, పచ్చదనంతో పాటు అనేక రంగాల్లో ముందంజలో ఉన్నాము. తెలంగాణ ప్రజల్లో అద్భుతమైన చైతన్యం ఉందన్నారు. అన్ని వర్గాల ఆకాంక్షల మేరకు పని చేస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు.
1956లో జరిగిన చిన్న పొరపాటు వల్ల 60 ఏండ్లు గోస పడ్డాం. ఎన్నో ప్రాణత్యాగాల వల్ల మళ్లీ తెలంగాణ సాధించుకున్నాం. ప్రపంచంలో ఏదేశానికి ఏని అనుకూలతలు భారత్‌కు ఉన్నాయి. అద్భుతమైన వ్యవసాయ అనుకూల వాతావరణం భారత్‌లో ఉంది. దేశ వ్యాప్తంగా 70వేల టీఎంసీల నీరు అందుబాటులో ఉందన్నారు. అత్యధిక పంటలు పండిస్తున్నా విదేశీ ఆహార పదార్థాలపై ఆధారపడుతున్నామని చెప్పారు.
మన రాష్ట్ర పురోగమనం అనుకున్న విధంగా సాగాలంటే సమాజం చైతన్యవంతంగా ఉండాలి. మేధావులు ముందుండి చైతన్యపరిస్తే సమాజం ముందుకు వెలుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.