తెలంగాణ రాజకీయం మరింత వేడెక్కుతోంది. మొన్న కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా తెలంగాణ పర్యటించగా.. ఇప్పుడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణ పర్యటన ఖరారు అయ్యింది. తెలంగాణలో పార్టీ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్‌ను పెంచేందుకు కాషాయ పార్టీ సీనియర్ నేతలు ప్రచారంలో బిజీగా ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గత నాలుగు నెలల్లో రాష్ట్రంలో పలుమార్లు పర్యటించారు. ఉప ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడానికి అమిత్ షా ఆదివారం మునుగోడులో పర్యటించారు. కాగా ఆగస్టు 27న హన్మకొండలో బండి సంజయ్ మూడవ దశ ప్రజా సంగ్రామ యాత్రలో భారీ బహిరంగ సభకు జెపి నడ్డా రానున్నారు.
ఇటీవల అమిత్ షా రాష్ట్రంలో మూడు సార్లు పర్యటించారు. ఇప్పుడు నడ్డా కూడా మూడోసారి తెలంగాణ రాష్ట్రానికి వచ్చారు. పార్టీ జాతీయ సర్వసభ్య సమావేశం సందర్భంగా మే 26న బేగంపేట విమానాశ్రయంలో జరిగిన సమావేశంలోనూ, జూలై 3న పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన బహిరంగ సభలోనూ ప్రధాని మోదీ ప్రసంగించారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే వరకు ప్రతి నెలా పర్యటించేందుకు సిద్ధమని అమిత్ షా ప్రకటించడం ఇక్కడ గమనార్హం. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్‌రావు, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే బొమ్మ వెంకటేశ్వర్లు కుమారుడు బొమ్మ శ్రీరామ్‌తో పాటు మరికొందరు ఆగస్టు 27న జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరనున్నట్లు సమాచారం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైన గెలవాలన్న లక్ష్యంతో బీజేపీ పావులు కదుపుతోంది.