నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ సినిమా ఇవాళ వరల్డ్‌ వైడ్‌గా విడుదల అయిన విషయం తెలిసిందే. ఇక సినిమా థియేటర్లలో ఎక్కడ చూసినా బాలకృష్ణ ఫ్యాన్స్‌తో నిండిపోయాయి. అఖండ సినిమా థియేటర్లలో రిలీజ్‌ కావడంతో.. థియేటర్ల దగ్గర పూర్తిగా బాలకృష్ణ అభిమానుల సందడి నెలకొంది. అయితే వరంగల్‌ నగరంలో అఖండ సినిమాను ప్రదర్శిస్తున్న ఓ థియేటర్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో ప్రేక్షకులు భయంతో ఒక్కసారిగా పరుగులు తీశారు. ఈ ఘటన వరంగల్‌ నగరంలోని జెమిని థియేటర్‌లో చోటు చేసుకుంది.

జెమిని థియేటర్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ప్రేక్షకులు సినిమా చూస్తుండగానే థియేటర్‌లో పొగలు అలుముకున్నాయి. దీంతో భయాందోళనకు గురైన ప్రేక్షకులు థియేటర్‌ బయటకు పరుగులు తీశారు. థియేటర్‌ యాజమాన్యం వెంటనే అప్రమత్తమై ఫైర్‌ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపు చేశారు. అయితే ఈ అగ్ని ప్రమాదం సంభవించడానికి గల కారణాలు మాత్రం తెలియాల్సి ఉంది. ముఖ్యంగా షార్ట్‌ సర్క్యూట్‌తోనే మంటలు చెలరేగాయని అంటున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

అంజి

నేను గోనె అంజి. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో 99టీవీ, మోజో టీవీ, ఐ న్యూస్‌, ప్రైమ్‌ 9 న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

Next Story